రోడ్ల వెంట ఎందరో యాచకులు, నిరాశ్రయులు తారసపడుతుంటారు. కడుపు నింపుకొనేందుకు కాళ్లావేళ్ల పడే దృశ్యాలు కనిపిస్తుంటాయి. అలాంటి వారికి ఐదో, పదో ఇవ్వాలనుకుంటాం.. వారి ఆకలి బాధను మాత్రం అంతగా పట్టించుకోం. కానీ కర్ణాటకలోని బెల్గాం నగరానికి చెందిన ఆర్బీ వలీ అనే వ్యక్తి స్థాపించిన 'డీఎఫ్ ఫౌండేషన్' మాత్రం వినూత్నంగా ఆలోచించింది.
ఇంజనీర్‌గా పనిచేసే వలీ.. 20 మంది మిత్రులతో కలసి ఏర్పాటు చేసిన 'డీఎఫ్ ఫౌండేషన్' అందించే 'ఫుడ్ కార్డుల'తో.. బెల్గాంలోని అభాగ్యులు స్థానిక హోటళ్లలో భోజనం చేసేలా వీలు కల్పించారు.
ఫుడ్ కార్డులు..
రూ.10 విలువైన 'డీఎఫ్ ఫుడ్ కార్డ్'ను విడుదల చేసిన యువకుల బృందం.. నిరాశ్రయులు, యాచకులు తమకు నచ్చిన ఆహారాన్ని భాగస్వామ్య హోటళ్ల నుంచి పొందేలా వీలు కల్పించారు. ఆయా హోటళ్లలో 'ఫుడ్ కార్డు'పై భోజనం అందిస్తామనే బోర్డులు కనిపిస్తాయి. అలాగే ఎవరైనా.. ఈ కార్డులను కొనుగోలు చేసి విరాళంగా ఇవ్వొచ్చంటోంది ఫౌండేషన్.
హోటళ్ల సహకారం..
ఇప్పటివరకూ బెల్గాం నగరవ్యాప్తంగా వేల కార్డులు పంపిణీ చేశారు. చాలా హోటళ్లు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యాయి. కార్డు కలిగి ఉన్న యాచకులకు టిఫిన్, భోజనం అందిస్తూ తమవంతు సహకారాన్ని అందిస్తున్నాయి హోటళ్లు.
శరణార్థి శిబిరాలకు యాచకులు..
వచ్చే సంవత్సరం వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఫౌండేషన్ యోచిస్తోంది. అప్పటిలోగా యాచకుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని భావిస్తోంది. ఇవే కాక ఇతర సేవా కార్యక్రమాలను చేపట్టిన సంస్థ.. యాచకులను, అనాథలను శరణార్థి శిబిరాలకు తరలిస్తోంది. కేవలం పది రూపాయలకే వీరు చేస్తన్న సేవ పట్ల పలువురు ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ చదవండి: నదిపై గ్రంథాలయం.. సరికొత్తగా పుస్తక పఠనం