ప్రణబ్ ముఖర్జీ.. భారత రాజకీయాల్లో ఓ భీష్మ పితామహుడు. ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటుపోట్లను, ఎత్తుపల్లాలను చూశారు. ఆదర్శనేతగా ఎదిగారు. నిరంతర అధ్యయనం, నిత్య పరిశ్రమ, విషయ పరిజ్ఞానం, నేర్పు, ఓర్పు, సంయమనం, సమయోచితంగా వ్యవహరించడం, దీక్షాదక్షతలో ఆయనకు సరిలేరెవ్వరూ.
ఇతరులను తన వాక్ పటిమతో ఒప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. చేపట్టిన పదవులకు తనదైన పనితీరుతో వన్నెతెచ్చిన నాయకుడు. నేటి తరం నాయకులకు ప్రణబ్ ఆదర్శనీయం. సాధారణ క్లర్క్ స్థాయి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన ఆయన ప్రస్థానం చిరస్మరణీయం.
- 1935 డిసెంబర్ 11న బంగాల్లోని బీర్భమ్ జిల్లా మిరాటీలో ప్రణబ్ జన్మించారు. తండ్రి కమద కింకార్ ముఖర్జీ, తల్లి రాజలక్ష్మీ.
- ప్రణబ్ ముఖర్జీ.. కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో పీజీ పూర్తి చేశారు. లా కూడా చదివారు. అధ్యాపకుడిగా, బంగాలీ పత్రికలో జర్నలిస్టుగా పనిచేశారు.
- రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ హయాంలో విదేశాంగ, రక్షణ, ఆర్థిక , వాణిజ్య శాఖల మంత్రిగా ప్రణబ్ సేవలందించారు. భిన్నమైన మంత్రిత్వ శాఖలను నిర్వర్తించిన నేతగా పేరొందారు.
- 1982లో కేంద్ర ఆర్థిక మంత్రిగా.. అత్యంత పిన్న వయసులో ఆ బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
- 1987లో ప్రణబ్ 'రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెస్' పేరుతో పార్టీని స్థాపించారు. 1989లో ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.
- 2012 నుంచి 2017 వరకు ప్రణబ్ 13వ భారత రాష్ట్రపతిగా సేవలందించారు.
అవార్డులు...
- ప్రణబ్ ముఖర్జీని 2008లోనే పద్మ విభూషణ్ అవార్డు వరించింది.
- 2010లో 'ఆసియాలో అత్యుత్తమ ఆర్థిక మంత్రి' అవార్డును అందుకున్నారు.
- 2013లో బంగ్లాదేశ్ రెండో అత్యుత్తమ పౌర పురస్కారానికి ఎంపికయ్యారు.
- 2019లో భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న' అందుకున్నారు. ఆ అవార్డ్‌ను అప్పటికే పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్రప్రసాద్, జాకీర్ హుస్సేన్, వీవీ గిరి సరసన ప్రణబ్ చేరారు.
రచయితగా...
- 1987లో 'ఆఫ్ ద ట్రాక్' అనే పుస్తకాన్ని రాశారు.
- 1992లో 'సాగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్', 'ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్' అనే పుస్తకాలను రచించారు.
- 2014లో 'ద డ్రమాటిక్ డెకేడ్: ద డేస్ ఆఫ్ ఇందిరాగాంధీ ఇయర్స్' అనే పుస్తకాన్ని రాశారు.