తమిళనాడు ఈరోడ్ జిల్లా మూలక్కదల్ ప్రాంతానికి చెందిన రంగస్వామి ఓ రైతు. తన వ్యవసాయ క్షేత్రంలోని బావి వద్ద కూర్చొని ఫోన్ మాట్లాడుతుండగా.. అనుకోకుండా చరవాణి అందులో జారి పడిపోయింది. బావిలో 60 అడుగుల మేర నీరు ఉన్నందున వెంటనే ఫోన్ను తిరిగి పొందలేక పోయాడు. ఎలాగైనా దాన్ని సాధించాలనుకున్నాడు. మోటార్ సాయంతో బావిలోని మొత్తం నీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు తోడేశాడు.
ఆ తర్వాత అడుగున ఫోన్ను తీసుకునేందుకు తాడు సాయంతో బావిలోకి దిగాడు. అయితే ఊహించని విధంగా తాడు తెగింది. అప్పటికే ఖాళీ అయిన బావిలో బురద నీరు మాత్రమే ఉంది. అందులో చిక్కుకుపోయిన రైతు బయటకు రాలేక పోయాడు. చీకటి పడినా రంగస్వామి ఇంకా ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. బావిలో స్పృహ కోల్పోయి పడిపోయాడని తెలుసుకుని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
అరగంటలో సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది రంగస్వామిని కాపాడారు. తాళ్ల సాయంతో బయటకు తీసుకొచ్చారు. అనంతరం చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.