కొవిడ్ మహమ్మారి సంక్షోభం కారణంగా భారత్‌లో అందరికన్నా ఎక్కువగా ఇబ్బంది పడినవారు వలస కార్మికులే. నిరంతరాయంగా విధించిన లాక్‌డౌన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికుల సంఖ్య ఎంతనేదీ నిర్దిష్టంగా తెలియకపోయినా- తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వారు సాగిస్తున్న పోరాటం అత్యంత బాధాకరంగా సాగుతోంది. వలస కూలీలు భారీ సంఖ్యలో పట్టణ ప్రాంతాల నుంచి తమ సొంతూళ్లకు పయనమైన వైనం- భారత్‌లో దశాబ్దాలుగా వారిపట్ల చూపుతున్న సామాజిక రాజకీయ దుర్విచక్షణనూ బహిర్గతం చేసింది. వలస కూలీల పట్ల సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమైన సంఘీభావం, వారు సొంత ప్రాంతాలకు చేరేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం వంటివి ఎన్నో దశాబ్దాలుగా వారు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రజల కళ్లకు కట్టాయి.
వారితో ఎలాంటి సంబంధం ఉండదు!
వలస కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తాము పనిచేసే చోట పరాయివ్యక్తులుగా పరిగణనకు గురికావడం. వీరి విషయంలో సంఘటిత రంగంలో మాదిరి యజమాని, కార్మికుల మధ్య సంబంధం ఉండదు. సరళీకృత ఆర్థిక వ్యవస్థలో వలస కార్మికులకు తమ మూలధన యజమానితో నేరుగా ఎలాంటి సంబంధం ఉండదు. యజమాని నుంచి కార్మికులను దూరంగా ఉంచడంలో కార్మిక గుత్తేదారు కీలక పాత్ర పోషిస్తాడు. కార్మికులు గుత్తేదారుపైనే ఆధారపడటం వల్ల వారి పరిస్థితి ఆర్థికంగా దుర్భరంగా మారుతుంది. గుత్తేదారు దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి జీవించాల్సి వస్తుంది. వారికి తమ హక్కులు, తమకు దక్కాల్సిన సౌకర్యాలపై సరైన అవగాహనా ఉండదు. వారు పనిచేసే పరిశ్రమలూ చాలావరకు ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కానివే. అయినా, వారు పరిశ్రమ, కార్మిక గుత్తేదారు ప్రయోజనాల కోసమే పని చేస్తారు.
రాజకీయ పలుకుబడి లేక..
భారత వృద్ధి, వేగవంతమైన పట్టణాభివృద్ధి ప్రక్రియలో ఇదంతా సర్వసాధారణ విషయంలా మారింది. లాక్‌డౌన్‌లో సైతం పరిశ్రమలు, కార్మిక గుత్తేదార్లు కార్మికులను ఆర్థిక కష్టనష్టాలకు వదిలేసి చేతులు దులుపుకొన్నారు. వలస కార్మికులకు రాజకీయ పలుకుబడి లేకపోవడం, వారి తరఫున ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం వంటి అంశాల కారణంగా అసమానతలకు లోనవుతున్నారు. స్వస్థలాలను వదిలి సుదూర ప్రాంతాలకు వలసవెళ్లడం వారికి రాజకీయంగా ప్రతికూలంగా మారుతోంది. తమ ప్రయోజనాల కోసం బేరసారాలాడే రాజకీయపరమైన శక్తి వారికి లేకపోవడమే ఇందుకు కారణమవుతోంది. ముఖ్యంగా, పనుల కోసం ఒక నగరం నుంచి మరొక నగరానికి లేదా ఒక నగరంలోనే పలుచోట్లకు వలస సాగించే కార్మికులను రాజకీయ పార్టీలు తమకు ప్రయోజనకరమైన ఓటర్లుగా పరిగణించడం చాలా అరుదు.
వలస కార్మికులను శక్తిమంతమైన ఓటుబ్యాంకుగా రాజకీయ పార్టీలు గుర్తిస్తే మాత్రం, వారెక్కడున్నా- వారి సమస్యలపై దృష్టి సారిస్తారని చెప్పవచ్చు. 2018 డిసెంబరులో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గుజరాత్‌లోని సూరత్‌ను సందర్శించారు. అది 2019 సార్వత్రిక, రాష్ట్ర ఎన్నికలకు ముందు పెద్దసంఖ్యలో ఉండే ఒడియా కార్మికులను బుజ్జగించేందుకే అనడంలో ఎలాంటి సందేహం లేదు. వలస జీవుల్ని కార్మికులుగానే గుర్తించడమూ రాజకీయంగా వారి పరిస్థితిని దుర్భరంగా మారుస్తోంది. వలస కార్మికులకు మతపరమైన, కులపరమైన గుర్తింపు ఉండదు. ఒకవేళ వారికే ఇలాంటి గుర్తింపు ఉంటే, రాజకీయ శక్తులు వారి విషయంలో వ్యవహరించే తీరే వేరేగా ఉండేదనడంలో ఏమాత్రం అనుమానం లేదు.
ఉపాధి కోసం భారీ సంఖ్యలో..
వలస కార్మికులు సామాజిక హోదాపరంగా దుర్విచక్షణ ఎదుర్కొంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయం మొదలుకుని, పలురంగాల్లో ఉపాధి దిశగా భారీ స్థాయిలో వలసలు ఉంటున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయ రంగం నుంచి జరిగిన వలస ప్రక్రియ- వారి సామాజిక హోదాను మరింతగా దెబ్బతీసింది. వ్యవసాయ కూలీలుగా తమ సొంతూళ్లలో వీరంతా ఎంతోకొంత సామాజిక హోదా, గౌరవాన్ని అనుభవించే పరిస్థితి ఉండగా- దురదృష్టవశాత్తు పట్టణ ప్రాంతాల్లో వీరికి వలస కూలీలుగా మాత్రమే గుర్తింపు దక్కింది. ఈ ప్రక్రియ వారి సామాజిక పెట్టుబడిని గణనీయంగా తగ్గించి వేసింది. వ్యవసాయ కూలీ నుంచి వలస కార్మికులుగా పరివర్తన చెందడం వల్ల ఎన్నో రకాలుగా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుత కొవిడ్ సంక్షోభంలో సామాజిక హోదా, వ్యక్తిగత గుర్తింపు, గౌరవాలకు మునుపెన్నడూ లేని స్థాయిలో భంగం వాటిల్లింది. కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్‌ల కారణంగా వలస కార్మికులు ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోయారు. వీరి సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వాల ఆలోచన తీరులో, విధాన నిర్ణయాల్లో ఎన్నో మార్పులు రావాలి.
- డాక్టర్ అన్షుమన్ బెహరా
(రచయిత- బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్)
ఇదీ చూడండి: ప్రభుత్వాల ఉమ్మడి వ్యూహంతోనే కరోనాపై విజయం!