ద్విచక్ర వాహనదారులకు కర్ణాటక రవాణా శాఖ హెచ్చరికలు చేసింది. హెల్మెట్ ధరించకపోతే మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేస్తామని స్పష్టంచేసింది. ఈ మేరకు ఈ నెల 16 తేదీతో రవాణా శాఖ కమిషనర్ అన్ని ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు, సహాయ అధికారులకు రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
మోటార్ వెహికల్ చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం ఇకపై హెల్మెట్ ధరించని వారికి జరిమానాలతో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను నిలిపివేయాలని పేర్కొన్నారు. తక్షణమే దీన్ని అమలు జరిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారి ప్రమాదాలు, తద్వారా సంభవించే మరణాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా సుప్రీంకోర్టు నియమించిన రహదారి భద్రతా కమిటీ చేసిన సూచనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
మోటార్ వెహికల్ చట్టంలోని 129 సెక్షన్ ప్రకారం ద్విచక్ర వాహనదారులంతా తప్పనిసరిగా హెల్మెట్‌లు ధరించాలి. వాహన చోదకులే కాకుండా వెనుక కూర్చొనేవారు కూడా (నాలుగేళ్ల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరూ) హెల్మెట్ ధరించాల్సిందేనని కర్ణాటక మోటార్ వెహికల్ చట్టంలోని నిబంధనలు పేర్కొంటున్నాయి. హెల్మెట్ ధరించనివారిపై విధించే రుసుముల విషయంలో గతేడాది సెప్టెంబర్‌లో ప్రజల నుంచి వ్యతిరేకత రావడం వల్ల అక్కడి ప్రభుత్వం రూ.1000గా ఉన్న జరిమానాను రూ.500కు తగ్గించింది.
ఇదీ చూడండి: బిహార్‌లో పట్టాలు తప్పిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్