దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా నియంత్రణకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. తబ్లీగీ జమాత్ సమావేశానికి సంబంధించి మతపరమైన విద్వేషాలను వ్యాపింపజేసేలా వార్తలను ప్రసారం చేసిన కొన్ని మీడియా సంస్థలపై చర్యలకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లకు స్పందనగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం అసంతృప్తి వ్యక్తం చేసింది.
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ చట్టాన్ని వర్తింపజేసే అంశాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ తన అఫిడవిట్‌లో స్పష్టంచేయలేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ స్టాండర్డ్స్ అథారిటీ వంటి బయటి సంస్థలకు మీడియా నియంత్రణ వంటి అంశాలను ఎందుకు అప్పగించాలని ప్రశ్నించింది. నియంత్రణ యంత్రాంగం లేకపోయినట్లయితే కొత్త దానిని నెలకొల్పవచ్చని, అటువంటి అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది. ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ చట్టాన్ని వర్తింపజేసే అంశాన్ని, దానికి సంబంధించి తీసుకున్న చర్యలను తమకు తెలియజేయాలని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ధర్మాసనం స్పష్టం చేసింది.
తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. మార్చి నెలలో దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్ సమావేశం గురించి అసత్య వార్తల ప్రసారాన్ని నిలువరించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది.