"ఫడణవిస్తో జరిపిన చర్చలు సంతృప్తికరం. అందుకే దీక్షను విరమించాలని నిర్ణయించాను."
-అన్నా హజారే, సామాజిక కార్యకర్త
అన్నాతో చర్చించేందుకు రాలేగావ్ చేరుకున్న ఫడణవిస్.. హజారే డిమాండ్లను ప్రభుత్వం ఆమోదిస్తుందని ప్రకటించారు. లోక్పాల్ ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు.
అవినీతి నిరోధక వ్యవస్థల ఏర్పాటుకు దీక్ష
కేంద్రంలో లోక్పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్త ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 30న హజారే దీక్షను ప్రారంభించారు. వాటితో పాటు స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనలను అమలు చేయటం.. ఎన్నికల సంస్కరణలు వంటి అంశాలపైనా హజారే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అధికారం వచ్చాక మరిచారు: హజారే
హజారే దీక్షకు మద్దతుగా గ్రామంలోకి ప్రభుత్వాధికారులు రావడాన్ని స్థానికులు అడ్డుకున్నారు. 2014 ఎన్నికల ముందు లోక్పాల్ ఏర్పాటుకు భాజపా నేతలు మద్దతిచ్చి.. అధికారంలోకి వచ్చాక అటకెక్కించారని హజారే మండిపడ్డారు. ఆ ఉద్యమంతోనే భాజపా అధికారంలో వచ్చిందనే విషయాన్ని మరిచారని హజారే పేర్కొన్నారు.
హజారే దీక్షకు మహరాష్ట్ర నవనిర్మాణ సేన, శివసేన పార్టీలు మద్దతు తెలిపాయి. పనికి రాని ప్రభుత్వం కోసం ప్రాణాలు పణంగా పెట్టొద్దని అన్నాకు ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రే కోరారు.