కేరళలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు నోట్లో పేలుడు పదార్థాలు పేలి మరణించిన ఘటన మరువనే లేదు. అంతలోనే వరుసగా అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ఒక ఎద్దు నోట్లో పేలుడు పదార్థాలు పేలి తీవ్రంగా గాయపడింది. అయోధ్య జిల్లాలోని మహారాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే దాటౌలి గ్రామంలో ఒక ఎద్దు గడ్డితినే క్రమంలో అడవి పందుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన పేలుడు పదార్థాన్ని కూడా తినేసింది. అది నోట్లోనే పేలటం వల్ల దవడ పగిలి తీవ్ర రక్తస్రావమైంది.
పక్కనే ఉన్న చెరువులోకి వెళ్లిపోయిన ఎద్దు... అక్కడే నిలబడి బాధతో మౌనంగా రోదిస్తోంది. గ్రామస్థుల సమాచారంతో అడవి పందుల కోసం పేలుడు పదార్థాలు పెట్టిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఎద్దుకు చికిత్స అందించారు అధికారులు.