దిల్లీని వణికిస్తున్న కరోనా వైరస్.. అన్ని ప్రాంతాలను దాటి ఆఖరికి రాష్ట్రపతి భవన్‌లోకి అడుగుపెట్టేసింది. రాష్ట్రపతి నివాసం సెక్రటరీ వద్ద పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరికి కరోనా సోకింది. వైద్య పరీక్షల్లో అతడికి పాజిటివ్ రాగా.. మొత్తం 125 మంది సిబ్బంది కుటుంబాలను క్వారంటైన్‌కు తరలించారు. ఆ సెక్రటరీకీ స్వీయ నిర్బంధం సూచించారు.
ఇదీ జరిగింది..
సెక్రటరీ అయిన మహిళ ఇంటిలో... ఆ వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడుగా పనిచేస్తున్నాడు. తాజాగా అతడి భార్యకు వైరస్ లక్షణాలు బయటపడగా... అప్రమత్తమైన అధికారులు అతడిని, తన భార్యను సహా మొత్తం 11 మంది కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కు తరలించారు. ఆ ఇంటికి చుట్టుపక్కల ఉన్నవారికి స్వీయ నిర్బంధం విధించారు. మొత్తం కుటుంబాలకు అధికారులే ఆహారం సరఫరా చేస్తూ.. ఎవరినీ బయటకు రావొద్దని సూచించారు.
ఆమెకు ఎలా వచ్చిందంటే...
ఆ పారిశుద్ధ్య కార్మికుడి భార్యకు వైరస్ రావడం వెనుక కారణాన్ని విశ్లేషించారు అధికారులు. కొవిడ్-19తో చనిపోయిన ఓ బంధువు అంత్యక్రియలకు ఆమె హాజరైనట్లు తెలిసింది.
రాష్ట్రపతికీ పరీక్షలు...
గతంలో బాలీవుడ్ నటి కనికా కపూర్‌కు వైరస్ పాటిజివ్ రాగా.. ఆమె కలిసిన వ్యక్తుల్లో భాజపా ఎంపీ దుష్యంత్ సింగ్ ఉండటం సంచలనం సృష్టించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు.. ఆయన హాజరవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆ సమయంలో సమావేశంలో పాల్గొన్న రాష్ట్రపతి సహా అందరికీ కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. ఎవరికీ కరోనా సోకలేదని నిర్ధరించారు.
దిల్లీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం బాధితుల సంఖ్య 2,081కి చేరగా.. ఇందులో 431 మంది కోలుకున్నారు. 47 మంది మృతిచెందారు.