దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 24 గంటల వ్యవధిలో 6 శాతమే పెరిగాయి. గత నెల 27న కనిపించిన 4.3% వృద్ధి తర్వాత రెండో అత్యల్ప పెరుగుదల ఇదే. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గురువారం సాయంత్రానికి దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 21,700కి చేరింది. కోలుకున్నవారి సంఖ్య 4325కి, మరణాల సంఖ్య 686కి పెరిగింది. దాదాపు 20 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టం చేశారు అధికారులు.
బుధవారం సాయంత్రం నుంచి 34 మంది మరణించినట్లు తెలిపారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 18 మంది, గుజరాత్ నుంచి ముగ్గురు ఉన్నారు. మొత్తం మృతుల్లో మహారాష్ట్ర నుంచి 269 మంది ఉన్నారు. గుజరాత్లో 103, మధ్యప్రదేశ్లో 81 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు విడిచారు.
5 లక్షల పరీక్షలు..
ఐసీఎంఆర్ చేసిన పరీక్షలు 5,00,542కి చేరాయి. ఈ నెల 19న (10.89%) మినహా వారం రోజుల్లో ఏ రోజూ కేసుల పెరుగుదల రేటు రెండంకెల సంఖ్యను చేరలేదు. ఏడురోజుల్లో సగటున 8.16% చొప్పున పెరిగాయి.
గత 28 రోజుల్లో కొత్త కేసులు నమోదు కాని జిల్లాల సంఖ్య 12కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. 23 రాష్ట్రాల్లోని 78 జిల్లాల్లో గత 14 రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాలేదని చెప్పారు.
4.5% మందికి వైరస్
దేశంలో 5 లక్షల పరీక్షలు పూర్తిచేసినట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. ఇందులో 4.5% మందికి కరోనా వ్యాపించినట్లు తేలిందన్నారు. దేశంలో ఈ నిష్పత్తి తొలినుంచీ స్థిరంగా ఉందని ఆయన స్పష్టంచేశారు. టెస్టింగ్ కిట్ల విషయంలో రాష్ట్రాలు చాలా అద్భుతంగా స్పందించాయని, రోగ నిర్ధారణలో ఆర్‌టీపీసీఆర్ పరీక్షలకు తిరుగులేదని చెప్పారు.
పరీక్షలకు త్వరగా ముందుకొస్తే మంచిది: గులేరియా
చుట్టుపక్కలవారు ఏమనుకుంటారోననే భయం లేకుండా ప్రాథమిక స్థాయిలోనే పరీక్షలు చేయించుకోవాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా పిలుపునిచ్చారు. దానివల్ల మరణాలను అరికట్టవచ్చన్నారు.
'ద.కొరియాతో సమానంగా అదుపులో ఉంచాం'
కేంద్ర ప్రభుత్వ సాధికార కమిటీ ఛైర్మన్ సీకే మిశ్ర మాట్లాడుతూ లాక్‌డౌన్ అమల్లో ఉన్న గత 30 రోజుల్లో పరీక్షలు 33 రెట్ల మేర పెంచినట్లు చెప్పారు. మార్చి 23న భారత్‌లో 400వ కేసు నమోదైందని, అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులను చూస్తే దక్షిణ కొరియాతో సమానంగా పరిస్థితులను భారత్ అదుపులో ఉంచగలిగినట్లు చెప్పారు.