పారామిలటరీ దళాల అన్ని నాన్-ఎమర్జెన్సీ సెలవులు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణ సమయంలో కరోనా వైరస్ సంక్రమించే ప్రమాదాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వ్యక్తిగతంగానూ, ప్రజా భద్రత విషయంలోనూ పారామిలటరీ దళాలు అప్రమత్తంగా ఉండాలని, కరోనాపై యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండాలని సూచించింది.
మూడు వారాలే అత్యంత కీలకం
కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన వైద్య విభాగం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రానున్న మూడు వారాలే అత్యంత కీలకమని పేర్కొంది. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా ధాటికి పారామిలటరీ సిబ్బంది 10 లక్షల మంది తీవ్ర ప్రభావానికి గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది. దేశ అంతర్గత, సరిహద్దుల రక్షణ కోసం పారామిలటరీ దళాలు కృషి చేయాలని ఆదేశించింది.
ఉత్తర్వుల ప్రకారం...
కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్) లేదా సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో-టిబిటెన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), అసోం రైఫిల్స్... వీటన్నింటికీ అత్యవసర సెలవులు తప్ప మిగతా అన్ని సాధారణ సెలవులు రద్దు చేశారు.
అన్నీ వాయిదా వేయండి
ప్రమోషన్లు, మెడికల్ రివ్యూలు, క్రీడలు, నియామకాలకు సంబంధించిన అన్ని సమావేశాలు సహా రోజువారీ డిపార్ట్మెంటల్ సమీక్షలు కూడా వాయిదా వేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. అలాగే విమానాలు, రైళ్లు, బస్సుల్లో దూర ప్రయాణాలు చేయకూడదని స్పష్టం చేశారు. షేక్ హ్యాండ్స్ మానుకోవాలని, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని స్పష్టం చేశారు.
అత్యవసర బడ్జెట్
కరోనా వ్యాప్తి నివారణ కోసం పారిశుద్ధ్య వస్తువులు, క్రిమిసంహారకాల కొనుగోలుకు అదనపు అత్యవసర బడ్జెట్ను కేటాయించాలని పారామిలటరీ దళాల అధిపతులు కోరారు.
ఇదీ చూడండి: 'కరోనాను ఏ అస్త్రంతోనూ ఎదుర్కోలేం- అదొక్కటే మార్గం'