దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించడానికి ముందే సెలవుపై, తాత్కాలిక విధులకు, కొత్త కోర్సులకు వెళ్లిన సిబ్బందిని తిరిగి విధుల్లో చేర్చుకోవడంపై నెలకొన్న సందిగ్ధతకు భారత సైన్యం తెరదించింది. అలా తిరిగి విధుల్లో చేరేందుకు వచ్చే ఉద్యోగులను ఆకుపచ్చ, పసుపు, ఎరుపు విభాగాలుగా వర్గీకరిస్తోంది. 14 రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకున్న సైనికులను ఆకుపచ్చ విభాగంగాను, 14 రోజుల క్వారంటైన్‌కు వెళ్లాల్సిన వారిని పసుపు విభాగంగాను, కొవిడ్-19 లక్షణాలు ఉన్నవారిని, ఐసోలేషన్ లేక ఆసుపత్రిలో చికిత్స అవసరమైన వారిని ఎరుపు విభాగంగాను వర్గీకరిస్తారు.
- సెలవులు, తాత్కాలిక విధులు, కొత్త కోర్సులకు వెళ్లి తిరిగివచ్చి విధుల్లో చేరే వారందరినీ పుసుపు విభాగంలో ఉంచుతారు. వీరు విధుల్లోకి చేరుతున్నట్లు సమాచారం ఇచ్చిన చోటే (రిపోర్టింగ్ స్టేషన్) ప్రత్యేక ఏర్పాట్లు చేసి 14 రోజుల క్వారంటైన్ అమలు చేస్తున్నారు. అనంతరం వీరిని సైనిక వాహనాల్లో లేదా ప్రత్యేక రైళ్లలో విధులు నిర్వర్తించే చోటకు (డ్యూటీ స్టేషన్) తీసుకెళతారు. ఒకవేళ సైనిక వాహనాలు, ప్రత్యేక రైళ్లలో కాకుండా వేరే మార్గాల్లో వెళ్లిన వారిని మళ్లీ పసుపు విభాగం కిందకు తెచ్చి 14 రోజుల క్వారంటైన్ అమలు చేస్తారు.
- ఉత్తరాది కమాండ్‌లోని అన్ని కేడర్ అధికారులు, ఆర్మీ మెడికల్ కోర్, ఆర్మీ డెంటల్ కోర్, మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్‌లలోని సిబ్బంది తమ యూనిట్ నుంచి విధులు నిర్వర్తించే చోటుకు (డ్యూటీ స్టేషన్) ప్రైవేటు వాహనాల్లో వెళ్లొచ్చు. అయితే యూనిట్ నుంచి విధులు నిర్వర్తించే చోటుకు (డ్యూటీ స్టేషన్) దూరం 500 కిలోమీటర్లు దాటకూడదు.
- భారత సైన్యంలో పనిచేసే నేపాలీయులు సెలవుపై తమ దేశానికి వెళ్లినట్లైతే పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సరిహద్దులు తెరిచిన తర్వాతే వారు రావాల్సి ఉంటుంది.