కొత్తగా పెళ్లయిన వారు ఏం చేస్తారు? హనీమూన్‌కు వెళ్తారు. లేదంటే... ఇంట్లోనే సరదాగా గడుపుతారు. కానీ... ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆ జంటను మాత్రం క్వారంటైన్‌కు తరలించారు అధికారులు.
పెళ్లయిన కొద్ది గంటలకే...
కొరియా జిల్లా మనేంద్రగఢ్కు చెందిన సుశీల్ గుప్తాకు, మధ్యప్రదేశ్ నౌరోజాబాద్కు చెందిన యువతికి పెళ్లి నిశ్చయం అయింది. కరోనా ఆంక్షలు అమలులో ఉన్న నేపథ్యంలో వివాహం కోసం అధికారుల అనుమతి తీసుకుని తల్లితో కలిసి వధువు ఇంటికి వెళ్లాడు సుశీల్.
మధ్యప్రదేశ్ నౌరోజాబాద్లో అతికొద్ది మంది బంధువుల సమక్షంలో వారి వివాహం జరిగింది. పెళ్లి వస్త్రధారణతో అత్తారింటి నుంచి స్వగ్రామానికి బయల్దేరింది నవజంట. కాసేపట్లో స్వగృహానికి చేరుకుంటుంది. అంతలోనే ఎదురుగా వచ్చిన ప్రభుత్వ యంత్రాంగం.. వారిని పట్టణంలోకి వెళ్లకుండా అడ్డుకుంది. పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న వారు నిర్బంధంలో ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది. నవ దంపతుల్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించింది.
'నిర్బంధానికి రెడీ అన్నా...'
పెళ్లి తంతు పూర్తయినప్పటికీ కొన్ని కార్యక్రమాలు ఇంకా ఉన్నాయని.. తమను ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలని అధికారులను కోరింది సుశీల్ పరివారం. గృహ నిర్బంధంలో ఉంటామని భరోసా ఇచ్చింది. అయినా అధికారులు మాట వినలేదు. అందరినీ క్వారంటైన్‌కు తరలించారు.
కుటుంబ పెద్ద మరో రాష్ట్రంలో..
వరుడి తండ్రి ఉత్తర్‌ప్రదేశ్‌లో చిక్కుకుపోయాడు. పెళ్లికి బంధువులను పిలిచేందుకు వెళ్లి లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయాడు.
ఇదీ చూడండి: ఆ ఆరుగురు మృతికి కారణం పుట్టగొడుగులే!