కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సామాజిక దూరం పాటించమని ప్రభుత్వాలు కోరుతున్న మాట నిజమే. కానీ, వైరస్ వ్యాప్తిపై అవగాహన లేని కొందరు మాత్రం సామాజిక వివక్షకు పాల్పడుతూ ప్రాణాలు బలిగొంటున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఉనా జిల్లా బంగాఢ్ గ్రామానికి చెందిన మహమ్మద్ దిల్షాద్ (37)కు కరోనా సోకిందనే అనుమానంతో గ్రామస్థులు ఆయనపై వివక్ష చూపారు. తట్టుకోలేని అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తబ్లీగీ జమాత్‌కు హాజరైన ఓ వ్యక్తిని కలసినందుకు గానూ.. దిల్షాద్కు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అయితే అతడికి కరోనా లేదని పరీక్షల్లో తేలింది. కొద్ది రోజులపాటు నిర్బంధంలో ఉంచి అతడిని ఇంటికి పంపించేశారు. కానీ, ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక గ్రామస్థుల తీరు దిల్షాద్ను కలచివేసింది. ఇరుగుపొరుగూ ఓ అంటరానివాడిలా చూస్తూంటే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
దిల్షాద్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు సీఆర్సీపీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
"కొంతమంది గ్రామస్థులు దిల్షాద్కు కరోనా సోకిందని అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహిస్తే అతడి శరీరంలో వైరస్ లేనట్లు నిర్ధరణ అయ్యింది. కానీ, తిరిగి ఇంటికి వెళ్లాక గ్రామస్థులు అతడి పట్ల వివక్ష చూపడం ప్రారంభించారు. దయచేసి ప్రజలు సామాజిక దూరం మాత్రమే పాటించండి.. సామాజిక వివక్ష చూపకండి"
-సీతారామ్ మర్దీ, డీజీపీ
రెండు రోజుల క్రితం తమిళనాడులో ఇలాంటి ఘటనే జరిగింది. కేరళ నుంచి వచ్చిన వలస కార్మికుడు ముస్తఫా కరోనా సోకిందనే నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.