కరోనా వైరస్ 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రమాదకరమని దేశదేశాల అనుభవాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బు, ఊపిరితిత్తి వ్యాధులు ఉన్నవారికి కరోనా వల్ల సంక్రమించే కొవిడ్ 19 ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. కనుక వృద్ధుల ఆలనాపాలనా చూసుకునేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇంటి సభ్యులూ తరచూ చేతులు శుభ్రపరచుకోవాలి. వృద్ధులు వాడే గ్లూకోమీటర్లు, రక్తపోటు కొలిచే సాధనాల వంటి పరికరాలను తరచూ శుభ్రపరచాలి. వయసు పైబడేకొద్దీ మనిషికి రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా వృద్ధులు విధిగా ఇంటికే పరిమితం కావాలి.
వారిలో ఉత్సాహం నింపాలి!
బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయే ఈ పరిస్థితి ఒకరకంగా వారిని ఒత్తిడికి గురిచేస్తుంది. అందువల్ల కుటుంబ సభ్యులు వారితో ఎక్కువ సమయం గడపాలి. తద్వారా వారిలో ఉత్సాహం నింపుతుండాలి. ఫోన్లలో మాటామంతీ, వీడియోల ద్వారా సంభాషణలు జరుపుతుండటం ఎంతో అవసరం. ఇరుగుపొరుగు పలకరింపులు, పాత స్నేహితులతో ముచ్చట్లు... వృద్ధులను ఒంటరితనం నుంచి బయటకు తీసుకొచ్చే కీలకాంశాలు. పాతజ్ఞాపకాలు, జీవిత అనుభవాలను చిన్న పిల్లలతో పంచుకొనే అవకాశాలను కల్పించాలి. వృద్ధులతో పరామర్శలప్పుడు అందరూ విధిగా భౌతికదూరం పాటించాలి. వారు కలవరపాటుకు గురికాకుండా భరోసా ఇవ్వాలి.
జాగ్రత్తలు తప్పనిసరి!
బాలలకు వైరస్‌ను తట్టుకునే శక్తి ఉంటుంది. ఒకవేళ వారికి వైరస్ సోకినా లక్షణాలు వెంటనే బయటపడవు. మనవలు మనవరాళ్ళను వృద్ధులు ఒళ్లో కూర్చోపెట్టుకోవడం, ముద్దాడటం వంటివి చేయకూడదు. పిల్లలు నలతగా కనిపిస్తే తప్పక దూరం పాటించాలి. వారికి పూర్తి స్వస్థత చేకూరేవరకు ఈ జాగ్రత్త తప్పనిసరి. వినికిడి శక్తి తగ్గిన వృద్ధులు ఇతరులతో మాట్లాడటానికి వీలు కల్పించే యాప్‌లు చాలానే ఉన్నాయి. మొబైల్ ఫోన్లలో వాటిని అమర్చుకుని బంధుమిత్రులతో సంభాషించవచ్చు. లాక్‌డౌన్ రోజుల్లో అన్ని ప్రార్థనాలయాలు మూసేసినందువల్ల ప్రత్యామ్నాయ భక్తి మార్గాలను ఎంచుకోవాలి. సాటి భక్తులతో మొబైల్, వాట్సాప్‌లలో మాటామంతీ జరపవచ్చు. టీవీల్లో వచ్చే భక్తి కార్యక్రమాలూ వారికి సాంత్వన కలిగిస్తాయి. భక్తి సమాజాలతో అంతర్జాలంలో ఆధ్యాత్మిక సంభాషణలు సాగించవచ్చు.
శారీరక సామర్థ్యాన్ని పెంచుకోవాలి!
తేలికపాటి వ్యాయామాలు, ప్రాణాయామం, ధ్యానం, భజన, ప్రార్థనలు- వృద్ధులకు వైరస్‌ను ఎదుర్కోగల శారీరక సామర్థ్యాన్ని అందజేస్తాయి. టీవీలో సినిమాలు, సీరియల్స్, వార్తలు చూస్తూ వృద్ధులు కాలక్షేపం చేస్తుంటారు. ఇప్పుడు టీవీ వార్తలన్నీ కరోనా సమాచారంతో నిండిపోతున్నాయి. ఆ వార్తలు వృద్ధుల్లో ఆందోళన పెరగడానికి కారణం కావచ్చు. అందువల్ల వారు టీవీ చూసే సమయాన్ని కుటుంబ సభ్యులు నియంత్రించడం మేలు. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో అనుభవాలను పంచుకోవడం, పిల్లలకు జీవిత పాఠాలు బోధించడం, కుటుంబ ఛాయాచిత్రాలను చూడటం, వంటావార్పులో తోడ్పడటం, పెరటి తోటను అందంగా తీర్చిదిద్దడం, కూరగాయలు పండించడం వంటివి చేయవచ్చు.
కరోనా ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. కనుక వృద్ధుల గదులను పరిశుభ్రంగా ఉంచాలి. గాలి వెలుతురు ప్రసరించేలా చూడాలి. దుమ్ముధూళి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాహారం అందజేయడం ద్వారా వైరస్‌ను ఎదుర్కోగల శారీరక సామర్థ్యాలను వారిలో పెంచాలి. తరచూ వేడినీరు అందజేయడం ఎంతో అవసరం. తద్వారా జలుబు, దగ్గు వంటి రుగ్మతలు వారి దరి చేరకుండా ఉంటాయి. ఎప్పటిమాదిరిగా కాకుండా కరోనా సమయంలో వృద్ధుల పట్ల మరింత ఎక్కువ శ్రద్ధాసక్తులు ప్రదర్శించడం కుటుంబ సభ్యుల బాధ్యత కావాలి.
ముందస్తు ఏర్పాట్లు..
వృద్ధులకు సుస్తీ చేస్తే వైద్య సహాయానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాట్లపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. అత్యవసర సమయాల్లో వైద్య సలహాల కోసం డాక్టర్ల ఫోన్ నెంబర్లను దగ్గర ఉంచుకోవాలి. ఆపత్సమయంలో అందుబాటు కోసం వాహన యజమానులతో అవగాహనకు రావాలి. లాక్‌డౌన్ సమయంలో కొన్ని ఆస్పత్రులు టెలీమెడిసిన్ సేవలకు ప్రత్యేక యాప్‌లు విడుదల చేశాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్థానిక ఆస్పత్రులు, మందుల దుకాణాల చిరునామాలు, అవి తెరిచి ఉండే వేళల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి.
చురుగ్గా ఉండాలి!
వృద్ధులకు కావలసిన మందులను రెండు మూడు నెలలకు సరిపడా ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి. అవి ఖాళీ అయ్యే ముందే తిరిగి సరఫరా చేయగల మందుల దుకాణాలు ఎక్కడ ఉన్నాయో చూసిపెట్టుకోవాలి. అత్యవసర సందర్భాల్లో వృద్ధులకు చేదోడు వాదోడుగా నిలవగల ఆప్తులను పిలవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. కొవిడ్- 19 కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్, భౌతిక దూరం పాటించడం వంటివి వృద్ధులకు మానసికంగా ఒత్తిడి కలిగించే మాట నిజం. దాన్ని తొలగించడానికి కుటుంబ సభ్యులు వినూత్న మార్గాలను ఆలోచించాలి, అనుసరించాలి. వృద్ధులు ఎవరి మీదా ఆధారపడాలనుకోరు. లాక్‌డౌన్ వేళ వారు శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండటానికి ప్రయత్నించాలి. అందుకు కుటుంబ సభ్యులూ తోడ్పడాలి.
ఇదీ చూడండి: తగ్గుతున్న వాయుకాలుష్యం.. తేటపడుతున్న నగరాలు