దేశంలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు కరోనా బారినపడ్డ వారి సంఖ్య 110కి చేరింది. మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండగా ఆ తర్వాతి స్థానంలో కేరళ ఉంది. మహారాష్ట్రలో కొత్తగా 12 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసులు 32కు పెరిగాయి. కేరళలో 22, దిల్లీలో 7, కర్ణాటకలో 6 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఉత్తరాఖండ్‌లో తొలికేసు..
ఉత్తరాఖండ్‌లో ఆదివారం తొలికేసు నమోదైనట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ. ఇప్పటి వరకు 13 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు తెలిపింది. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు.. పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లు మూసివేశాయి. కోర్టులు కూడా అత్యవసర వ్యాజ్యాలనే విచారణ చేపట్టాలని నిర్ణయించాయి. కొన్ని కంపెనీలు ఇళ్ల నుంచే పనిచేసేలా ఏర్పాట్లు చేశాయి. సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ నెల 31 వరకు షాపింగ్ మాల్స్, పాఠశాలలు, కళాశాలలు మూసివేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ఎలాంటి విదేశీ, స్వదేశీ యాత్రలు చేపట్టకుండా పర్యాటక సంస్థలపై ఆంక్షలు విధించింది.
ఆ 20 మందిపై ప్రత్యేక పర్యవేక్షణ..
కేరళలోని కోచి నుంచి దుబాయి వెళ్లే విమానంలో... యూకేకి చెందిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు నిర్ధరణ అయింది. తక్షణమే అప్రమత్తమైన అధికారులు, విమానంలో ఉన్న 289 మంది ప్రయాణికుల్ని పరీక్షించి, 20 మందిని పర్యవేక్షణలో ఉంచారు. కరోనా నిర్ధరణ అయిన యూకే దేశస్థుడిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. బస్సులు, రైళ్ల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించేవారికి కేరళ ప్రభుత్వం.. రాష్ట్ర సరిహద్దుల వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. తమిళనాడు, పుదుచ్చెేరి, హరియాణాలలో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 29 వరకు పాఠశాలల మూసివేత సహా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు అసోం అధికారులు వెల్లడించారు.
భారత్‌లో ప్రస్తుతానికి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వైరస్ సోకినట్లు పెద్దగా దాఖలాలు లేవన్న కేంద్ర ప్రభుత్వం.. ప్రజలు భయపడాల్సిన పనిలేదని తెలిపింది. ఇరాన్, ఇటలీల నుంచి స్వదేశానికి వచ్చిన భారతీయులను వేర్వేరు క్వారంటైన్ కేంద్రాలలో ఉంచారు.
ఇదీ చదవండి: కరోనాను జయించేందుకు ఇవి తెలుసుకోండి...