సరిహద్దు వివాదంపై భాజపా, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తూర్పు లద్దాఖ్ గల్వాన్ లోయ వద్ద భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందో లేదో... ప్రధాని మోదీ స్పష్టం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన భాజపా... లద్దాఖ్‌లోని సరిహద్దు పరిస్థితులపై కాంగ్రెస్ 'అసత్యాలు' ప్రచారం చేస్తోందని ప్రత్యారోపణలు చేసింది.
" కాంగ్రెస్ చైనాకు అనుకూల ప్రచారం చేస్తూ... దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తోంది. ముఖ్యంగా భారత సాయుధ దళాల ధైర్యాన్ని తగ్గించేలా... లద్దాఖ్ సరిహద్దు వివాదంపై.... చైనాకు అనుకూలంగా కాంగ్రెస్ 'అసత్యాలు' ప్రచారం చేస్తోంది."
- జీవీఎల్ నరసింహారావు, భాజపా అధికార ప్రతినిధి
ఒక్క అంగుళం కూడా..
కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు చైనా... భారత భూభాగంలోకి చొచ్చుకురాలేదని జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
"భారత భూభాగంలోని ఒక్క అంగుళం కూడా చైనా దురాక్రమణలో లేదని ప్రధాని మోదీ నిస్సందేహంగా, నిశ్చయంగా తెలిపారు. అయితే కాంగ్రెస్ మాత్రం చైనాకు లొంగిపోయింది. అందుకే డ్రాగన్‌కు అనుకూల ప్రచారం చేస్తోంది."
- జీవీఎల్ నరసింహారావు, భాజపా అధికార ప్రతినిధి
ఆ విరాళాల సంగతేంటి?
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు... చైనా రాయబార కార్యాలయం నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్)కు భారీ విరాళం అందినట్లు భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. దీని వల్ల గాంధీల కుటుంబం అక్రమంగా ఆర్థిక ప్రయోజనాలు పొందిందని, దీనిని దేశ ద్రోహ చర్యగా పరిగణించాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంపై కాంగ్రెస్ మౌనం వహించడాన్ని చూస్తుంటే.. కచ్చితంగా తప్పు చేసినట్లు రుజువు అవుతోందని ఆయన విమర్శించారు.
మరోవైపు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా.. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు.. ఆర్జీఎఫ్కు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.90 లక్షలు మేర కేటాయించారని పేర్కొన్నారు. ప్రజలకు చెందాల్సిన సొమ్మును ఇలా మళ్లించడం నైతికంగా ఎంత వరకు సమర్థనీయమో... కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు.
అదే నిజమైతే.. సైనికులు ఎలా చనిపోయారు?
'స్పీక్ అప్ ఫర్ జవాన్' కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ... భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోదీ చెబుతున్నట్లు భారత భూభాగంలోనికి చైనా సైనిక బలగాలు చొరబడకపోతే.. మరి భారతీయ వీర జవానులు ఎందుకు అమరులయ్యారని ఆమె ప్రశ్నించారు.
ప్రస్తుతమున్న లద్దాఖ్ పరిస్థితులపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు విశ్వాసం కల్పించాలని సోనియా గాంధీ కోరారు. ఉపగ్రహ చిత్రాలు చూసిన నిపుణులు మన భూభాగంలో చైనా దళాల చొరబాట్లను ధ్రువీకరిస్తున్నారన్న సోనియా.... లద్దాఖ్‌లోని భారత భూమిని మోదీ ప్రభుత్వం ఎప్పుడు తిరిగి తీసుకుంటుందని ప్రశ్నించారు.
మోదీజీ భయపడకండి !
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మోదీ సర్కార్‌పై విమర్శలు కురిపించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా? అని ప్రశ్నించారు. అదే జరిగితే ప్రధాని మోదీ ఆ విషయాన్ని ధైర్యంగా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశమంతా ఐకమత్యంతో మోదీ వెంట ఉంటుందన్న రాహుల్ గాంధీ.. చైనాను భారత భూభాగం నుంచి వెనక్కి తరిమికొట్టాల్సిందేనని స్పష్టం చేశారు.
గల్వాన్ లోయను సంరక్షిస్తున్న జవాన్లకు ఆయుధాలు అందించకుండా.. చైనీయులపైకి ఎవరు పంపారో చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. వీర సైనికులు అమరులైన ప్రదేశం భారత్‌ది అని.. దాన్ని మోదీ చైనాకు అప్పగించరాదని ఆమె విమర్శించారు.
ఇదీ చూడండి: పాక్ ఉగ్ర శిబిరాల్లో 200 మంది కశ్మీరీలు?