కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు వైరస్‌కు ఎదురెళ్లి పోరాడుతున్నారు వైద్యులు. వృత్తి ధర్మాన్ని కాపాడడంలో.. కేవలం వారి ప్రాణాలను పణంగా పెట్టడమే కాదు, ఇల్లు వాకిలి వదిలి రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఓ వైద్యురాలు 8 నెలల నిండు గర్భిణి అయినా.. ప్రజలకు వైద్యం చేసేందుకు ధైర్యంగా ముందడుగు వేసింది. ఛండీగఢ్‌లో ఏడేళ్ల కుమారుడిని ఇంట్లో ఒంటరిగా వదిలి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు వైద్య దంపతులు.
కడుపున బిడ్డతో ప్రజాసేవలో..
ఛత్తీస్‌గఢ్ కొండగావ్ జిల్లా కేరావాహీ గ్రామంలో డాక్టర్ సంతోషి మనిక్పురి సేవలను చూసినవారంతా సలాం అంటున్నారు. సంతోషి ఎనిమిది నెలల నిండు చూలాలు. సాధారణ సమయాల్లోనే గర్భిణి గడపదాటి ఉద్యోగం చేయడమంటే గొప్ప విషయం. అలాంటిది, కరోనాకాలంలో బయటకు వెళ్తే తనతో పాటు, కడుపున బిడ్డకూ ప్రమాదమేనని తెలిసినా.. దేశానికి తన వంతు సేవ చేసేందుకు సిద్ధపడింది.
"నాకు వైద్యం చేయడమంటే ఇష్టం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది. నా వృత్తి బాధ్యతలు నిర్వర్తించడంలో నా భర్త, కుటుంబం నుంచి పూర్తి సహకారం లభిస్తోంది."
- డా. సంతోషి మనిక్పురి
కుమారుడిని బంధించి..
ఛండీగఢ్‌లో డాక్టర్ సంజయ్ జైస్వాల్ పీజీఐఎమ్ఈఆర్లో కొవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తూ.. కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. భార్య గీతిక సింగ్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యురాలు. ఇద్దరూ రోగుల ప్రాణాలు కాపాడేందుకు పోరాడుతున్నారు.
ఈ క్రమంలో తమ ఏడేళ్ల కుమారుడిని వెంట తీసుకెళ్లలేని పరిస్థితి. కనీసం వీధిలో ఎవరింట్లోనైనా వదిలి వెళ్దామంటే.. వైద్యులకు కరోనా సోకే ప్రమాదం ఉందని, ఆ వైరస్ తమకు చుట్టుకుంటుందని ఎవరూ దగ్గరకు రానివ్వట్లేదు. దీంతో.. చేసేదేమీ లేక బాధను గుండెల్లో దాచుకుని తనయుడిని ఇంట్లో వదిలి ఆసుపత్రికి వెళ్లి సేవలందిస్తోంది ఆ తల్లి.
"నేను నా భర్తను చూసి 17 రోజులవుతుంది. మరో ఆరు రోజులు ఆయన క్వారంటైన్లో ఉంటారు. ఆ తర్వాత ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అదృష్టవశాత్తు నెగిటివ్ వస్తే ఆయన ఇంటికి వచ్చేస్తారు. ఈ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుంది. నేను ఆసుపత్రిలో రోగులకు చికిత్స చేసేందుకు వెళ్లిన ప్రతిసారి నా కొడుకును ఇంట్లో నిర్బంధించి వెళ్తాను. ఏడేళ్ల ఈ చిన్నారికి చీకటి అంటే చాలా భయం. కానీ, మా కాలనీలో ఎవరూ తనను ఓ గంట కూడా ఇంట్లో ఉంచుకునేందుకు సిద్ధంగా లేరు. మా నుంచి వారికి కరోనా సోకుతుందని వాళ్ల భయం."
-డా. గీతిక సింగ్
ఇదీ చదవండి:విస్తృత పరీక్షలే కరోనా కట్టడికి శరణ్యం!