ఈ దశాబ్దాన్ని భారత్ దశాబ్దంగా మార్చేందుకు దేశంలోని అన్ని రంగాల్లో ఏకకాలంలో సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గడచిన ఆరేడు మాసాలుగా.. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరమైనట్లు చెప్పారు. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) భారత్‌ను ఉన్నత విద్యలో ప్రపంచానికే కేంద్ర బిందువుగా మార్చేందుకు తీసుకొచ్చిన పెద్ద సంస్కరణగా మోదీ పేర్కొన్నారు.
కర్ణాటకలోని మైసూర్ విశ్వవిద్యాలయం శతవార్షిక స్నాతకోత్సవం-2020లో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వర్షాలు, కరోనా మహమ్మారి నడుమ జరుగుతున్నప్పటికీ స్నాతకోత్సవ స్ఫూర్తి మాత్రం తగ్గలేదన్నారు.
" దేశంలో ఇప్పుడు ప్రవేశపెట్టిన తరహాలో గతంలో ఎప్పుడూ సంస్కరణలు చేపట్టలేదు. గతంలో ఓ రంగానికి సంబంధించి ఏవైనా నిర్ణయాలు జరిగాయంటే మరో రంగంపై తీవ్ర ప్రభావం పడేది. అయితే గడిచిన 6-7 అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చాం. సాగు సంబంధిత సంస్కరణలు.. రైతులకు స్థైర్యాన్నిచ్చాయి. కార్మిక రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు కార్మికులతో పాటు పారిశ్రామిక రంగంలో ధైర్యాన్ని, భరోసాను కల్పించాయి. సంస్కరణల్లో వేగం, పరిధి పెరిగింది. వ్యవసాయం, అంతరిక్షం, రక్షణ, వైమానిక వంటి ప్రతిరంగంలో వృద్ధే లక్ష్యంగా చర్యలు చేపట్టాం. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
జాతీయ విద్యా విధానం అనేది దేశంలోని ప్రీనర్సరీ నుంచి పీహెచ్‌డీ వరకు పూర్తి విద్యావ్యవస్థలో ప్రాథమికమైన మార్పులు తీసుకొచ్చేందుకు తెచ్చిన అద్భుతమైన విధానమన్నారు మోదీ. యువత అన్ని రంగాల్లో పోటీపడేలా తీర్చిదిద్దేందుకు బహుముఖ విధానాల్లో ముందుకు వెళ్లడం జరుగుతోందని తెలిపారు. ఉద్యోగాన్ని బట్టి మన యువత వేగంగా వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, అందిపుచ్చుకోవడం, మార్చుకోవడం, పదును పెట్టుకోవడం ఇప్పుడు అత్యావశ్యకమని తెలిపారు.
కన్నడ ప్రజలకు దసరాను పురస్కరించుకొని జరుపుకొనే "నాదా హబ్బాకి" శుభాకాంక్షలు తెలిపారు మోదీ. కరోనా వేళ అందరూ జాగ్రత్తలు తీసుకుంటూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. వరదల కారణంగా ప్రభావితమైన వారికి సాయం అందించేందుకు కేంద్రం, కర్ణాటక ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: కమల్‌నాథ్ అనుచిత వ్యాఖ్యలపై దుమారం