రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రలోభ పరిచేందుకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు చొప్పున భాజపా ఎరవేస్తోందని ఆయన ఆరోపించారు.
జూన్ 19న రాజస్థాన్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను జైపుర్‌లోని శివ విలాస్ రిసార్టుకు తరలించింది. ఈ సందర్భంగానే గహ్లోత్.. భాజపాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల అంశమై గురువారం సమావేశమైన రాష్ట్ర కాంగ్రెస్.. తన ఎమ్మెల్యేలను తిరిగి ఇళ్లకు పంపించేసింది.
ఎమ్మెల్యేల కొనుగోలుకు?
భాజపా.. మధ్యప్రదేశ్‌లో అనుసరించిన వ్యూహాన్నే రాజస్థాన్‌లోనూ అమలు చేయాలని చూస్తోందని గహ్లోత్ ఆరోపించారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లు చొప్పున ఎరవేశారని, ముందుగా రూ.10 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారని గహ్లోత్ అన్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కోసం భాజపా అధినాయకత్వం దిల్లీ నుంచి జైపుర్‌కు భారీగా డబ్బులు పంపించినట్లు తమకు సమాచారముందని గహ్లోత్ తెలిపారు. అయితే తమ ఎమ్మెల్యేలు అప్రమత్తంగా, ఐక్యమత్యంతో ఉన్నారని, వారు భాజపా ప్రలోభాలకు లొంగిపోరని గహ్లోత్ ధీమా వ్యక్తం చేశారు.
మోదీ మార్క్ రాజకీయం!
ప్రధాని మోదీ విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గహ్లోత్ విమర్శించారు. అయితే రాజస్థాన్, గుజరాత్‌ల్లో భాజపా పాచికలు పారలేదని, అందుకే రాజ్యసభ ఎన్నికలు వాయిదాపడేటట్లు చేశారని గహ్లోత్ ఆరోపించారు.
కాంగ్రెస్‌కు కష్టమే..
రాజస్థాన్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సతీశ్ పూనియా కాంగ్రెస్‌పై సునిశిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ కష్టమేనని, ప్రస్తుతం ఆ పార్టీ తమ ఎమ్మెల్యేలనే నమ్మలేని పరిస్థితుల్లో ఉందని ఎద్దేవా చేశారు.
జూన్ 19న ఎన్నికలు
జూన్ 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్.. కేసీ వేణుగోపాల్, నీరజ్ డాంగీలను అభ్యర్థులుగా నిలపగా, భాజపా రాజేంద్ర గహ్లోత్, ఓంకార్ సింగ్ లఖావత్లను పోటీచేయిస్తోంది.
రాజస్థాన్ అసెంబ్లీలో 200 స్థానాలున్నాయి. కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఆరుగురు బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో 12 మంది అధికార కాంగ్రెస్‌కే మద్దతుగా ఉన్నారు.
ఇదీ చూడండి: బడిగంటలపై డోలాయమానం.. నిర్వహణలో సవాళ్లు!