మాజీ క్రికెటర్, భాజపా నేత గౌతమ్ గంభీర్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశి మధ్య అభ్యంతర కరపత్రాల వ్యవహారం రోజురోజుకు తీవ్రస్థాయికి చేరుకుంటోంది. విమర్శల పర్వం దాటి తాజాగా దిల్లీ మహిళా కమిషన్ను చేరింది. గంభీర్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన కరపత్రాలను పంచారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై భాజపాతో పాటుగా గంభీర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు అతిశి. ఈ వ్యవహారానికి వీరు తప్ప మిగతా వారెవరూ కారణం కాదని దిల్లీ మహిళా కమిషన్లో ఫిర్యాదు చేశారు. తనకు వ్యతిరేకంగా పంచిన కరపత్రాలను జతచేస్తూ అధికారులకు లేఖను అందజేశారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
" ఈ వ్యవహారంలో అన్ని కోణాల్లోనూ పూర్తి స్వతంత్ర దర్యాప్తు జరిగేలా మీరు తక్షణం జోక్యం చేసుకోవాలని ఈ లేఖ రాస్తున్నాను. మోసపూరిత వ్యక్తులపై నేను చేస్తోన్న ఈ యుద్ధంలో నాకు తోడుగా నిలవమని మిమ్మల్ని కోరుతున్నాను."
- అతిశి, ఆప్ అభ్యర్థి
తనపై అభ్యంతరకర వ్యాఖ్యలతో కూడిన కరపత్రాలను గంభీర్ ప్రజలకు పంచి పెట్టారని ఆమ్ఆద్మీ తూర్పు దిల్లీ అభ్యర్థి అతిశి గురువారం ఆరోపించారు. మీడియా ఎదుటే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయంపై అరవింద్ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. గంభీర్ ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడతారని ఊహించలేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఆప్ నేతలు గంభీర్పైన విమర్శలు చేశారు.
వీటిపై గంభీర్ ఇదివరకే స్పందించారు. అతిశిని.. అవమానించేలా అభ్యంతరకరమైన కరపత్రాలను తాను పంచినట్టు రుజువు చేస్తే బహిరంగంగా ఉరేసుకుంటానన్నారు. అవన్నీ నిరాధార ఆరోపణలేనని కొట్టి పారేశారు. తనకు మహిళలంటే ఎంతో గౌరవమని, వారిని అవమానించేలా ఏ పని చేయలేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : 'పాక్ నుంచి వచ్చిన విమానంతో ప్రమాదేమేమీ లేదు'