ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన సెగలు... భగ్గుమన్న ఈశాన్యం... సీఏఏకు వ్యతిరేకంగా ఆగ్రహజ్వాలలు... ఇవి కరోనా మహమ్మారి రాకముందు దేశ పత్రికల్లో పతాక శీర్షికలు.
పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ)కు పార్లమెంటు ఆమోదం పలికిన నాటి నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. కర్ఫ్యూను సైతం లెక్కజేయకుండా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. ఎన్ఆర్సీ, సీఏఏ కారణంగా అసోంలో ఈ ప్రభావం మరింత ఎక్కువ. అయితే అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారి వల్ల ప్రజల దృష్టి మళ్లింది.
వ్యతిరేకతను నమ్ముకుని...
ఎన్ఆర్సీ-సీఏఏ ఆందోళనలు ప్రస్తుతానికి సద్దుమణిగినా... ఆ వ్యతిరేకతను రాజకీయ అస్త్రంగా మార్చాలని భావిస్తున్నాయి అనేక ప్రజా సంఘాలు. సీఏఏ అస్త్రంతో 2021 అసోం శాసనసభ ఎన్నికలపై గురి పెడుతున్నాయి. ఆ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో కొత్త పార్టీలు ఏర్పాటు చేస్తూ... అధికార ఎన్డీఏకు సవాల్ విసురుతున్నాయి.
ఇవే కొత్త పార్టీలు....

- ప్రముఖ జర్నలిస్ట్, రాజ్యసభ సభ్యుడు అజిత్ భుఈ స్థాపించిన ఆంచలిక్ గణ మోర్చా (ఏజీపీ).
- అదిప్ ఫుకాన్ నేతృత్వంలోని అసోం సంగ్రామీ మోర్చా (ఏఎస్ఎమ్).
- అఖిల్ గొగొయి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న 'క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి'
- ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు) సైతం రాజకీయ పార్టీ పెట్టి బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోంది.
కాంగ్రెస్ ఇలా...
అసోం ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. 2001 నుంచి 15 ఏళ్లపాటు ఆ పార్టీదే అధికారం. 2016 ఎన్నికల్లో భాజపా, అసోం గణ పరిషత్(ఏజీపీ)ని ఎదుర్కోలేక చతికిలపడింది కాంగ్రెస్. 2021లో అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఐఎఫ్)తో కలిసి పోటీ చేసేందుకు స్నేహగీతాలు ఆలపిస్తోంది.
ఒకానొక సమయంలో ఏఐయూడీఐఎఫ్ అధ్యక్షుడ్ని ఉద్దేశిస్తూ 'బదురుద్దీన్ అజ్మల్ ఎవరు?' అని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి అన్నారు. ఇప్పుడు ఆ అజ్మల్‌ను నమ్ముకునే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుండటం గమనార్హం.
అది ఒకటే చాలదు...
అధికార కూటమిని ఎదుర్కొనేందుకు సీఏఏపై వ్యతిరేకత మాత్రమే సరిపోదు అనేది వాస్తవం. పౌరసత్వ చట్ట సవరణే ప్రధాన అస్త్రంగా విపక్షాలు ఎన్నికలకు వెళితే అది అధికార ఎన్డీఏకు ప్రయోజనం చేకూరుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. వివిధ వర్గాలు, స్వయం సహాయక బృందాలు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయడం వృథా అన్నది వారి వాదన. వర్గాలు, విభేదాలను పక్కన పెట్టి ఐకమత్యంగా పోరాడాలని సూచిస్తున్నారు. ముందు 126 నియోజకవర్గాల్లోని ప్రజలను ఏకతాటిపైకి తేవాలన్నారు అసోం దివంగత నేత కలగురు బిష్ణు ప్రసాద్ రబా తనయుడు పృథ్వీరాజ్ రబా.
ప్రజల మాటేంటి?
ఎన్నడూ లేని విధంగా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు పోటీ చేయడం ప్రజలకు కాస్త కొత్తగా ఉంది. ముఖ్యంగా ప్రాంతీయవాదం బలోపేతం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఎవరికి వేయాలనే అంశాన్ని సీఏఏపై ఉన్న అసంతృప్తే నిర్ణయిస్తుందా? లేక అభివృద్ధి మంత్రంతో ప్రజా విశ్వాసాన్ని భాజపా మరోసారి సాధిస్తుందా? చూడాలి.