అసోంను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా 16 జిల్లాలకు చెందిన 2.53 లక్షల మంది ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. మరోవైపు వరదల్లో చిక్కుకుని ఇవాళ ఓ వ్యక్తి మరణించాడు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 16కు పెరిగింది.
దీహాజీ, లకింపూర్, బిస్వాంత్, నల్బరీ, బర్‌పేట, కోక్రజ్‌హార్, నాగోన్, జోర్హాట్, శివసాగర్, దిబ్రుగఢ్, తిన్సుకియా జిల్లాల్లో వరదల ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మెుత్తం 162 సహాయ శిబిరాల్లో 40 వేల 373 మంది ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు 12 వేల హెక్టార్లలోని పంట నీట మునిగింది. రోడ్లు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వన్యజీవులు
పొబిటోరా అభయారణ్యం 80 శాతం మునిగిపోయిందని... ఫలితంగా భారతీయ ఖడ్గమృగాలు సహా వన్యప్రాణులన్నీ ప్రమాదంలో పడ్డాయని ఈ నివేదిక పేర్కొంది. ఈ అభయారణ్యంలో సుమారు 100 ఖడ్గ మృగాలు, 1500 అడవి గేదెలు, వేలాది పందులు ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు బ్రహ్మపుత్ర నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఇదీ చూడండి: పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం.. రూ. లక్షల ఆస్తి నష్టం