ETV Bharat / bharat

కరోనాపై మహాసంగ్రామంలో ముంగిళ్లకే నిత్యావసరాలు!

author img

By

Published : Mar 28, 2020, 7:35 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కోవడంలో కృత్రిమ మేధ, బిగ్‌డేటాలను దక్షిణ కొరియా, తైవాన్‌, చైనా వంటి దేశాలు సమయానుగుణంగా వినియోగించుకున్నాయి. వాటి అనుభవాలే విలువైన పాఠాలుగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ప్రణాళికలు రాటుతేలాలి. దేశవ్యాప్తంగా నిర్బంధ ప్రాంతాల్లోని వారందరికీ కావాల్సిన రోజువారీ వినియోగ వస్తువులు, కూరగాయలు, మందులు ఎవరిళ్లలో వారికి అందించే పకడ్బందీ ఏర్పాట్లు జరగాలి.

eenadu
ముంగిళ్లకే నిత్యావసరాలు!

'మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల్లో ముగిసింది... కరోనా మహమ్మారిపై భరతజాతి మహా సంగ్రామం 21 రోజులపాటు కొనసాగుతుంది!'- దేశవ్యాప్త మూసివేత (లాక్‌డౌన్‌) నిర్ణయం ప్రకటిస్తూ ప్రధాని మోదీ పలికిన మాటలవి. సుమారు 130 కోట్ల జనబాహుళ్యం కదలికల్ని పరోక్షంగా నియంత్రిస్తున్న కర్కశ వైరస్‌పై, ఇది గెలిచి తీరాల్సిన పోరాటమంటూ- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిర్ణయాలు వెలువరిస్తున్నాయి. 'ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన' పేరిట వెలుగుచూసిన సంక్షేమ ప్యాకేజీలో భాగంగా- 80 కోట్లమంది పేదలకు మూడు నెలలపాటు ఉచితంగా అయిదు కిలోల బియ్యం లేదా గోధుమలు అదనంగా ఇస్తామని కేంద్రం చెబుతోంది.

వాస్తవంలో పరిస్థితి భిన్నం

ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలూ సంక్షోభ తరుణంలో అన్నార్తుల ఆకలి తీర్చేందుకంటూ రేషన్‌ పంపిణీపై హామీలిచ్చాయి. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఇదమిత్థంగా సమయం నిర్దేశించినా, కుటుంబం నుంచి ఒక్కరే వెళ్ళి అవి తీసుకోవాలని ఆంక్షలు విధించినా- వాస్తవంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కూరగాయలకనో, రేషన్‌ సరకులకనో, అత్యవసరమైన మందులకనో రోడ్లపైకి వస్తున్నవారి సంఖ్య గణనీయంగా ఉంటోంది. కొన్ని కూడళ్లలో రద్దీ కనిపిస్తోంది. రైతు బజార్ల వంటిచోట్ల జనసమ్మర్ద దృశ్యాలు ఆందోళనపరుస్తున్నాయి. నిత్యావసరాల లభ్యతపై వదంతుల వ్యాప్తి ప్రజానీకాన్ని గందరగోళపరుస్తుండగా, ఉన్నంతలో త్వరగా సరకులు తెచ్చేసుకోవాలన్న ఆదుర్దా ఎందరినో రోడ్లపైకి తరుముతోంది. పలుచోట్ల పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోని ఆకతాయి మూకలను నిలువరించడం, గస్తీ బృందాలకు తలనొప్పిగా మారుతోంది. ఏ కారణంగానైనా ఇళ్ల నుంచి బయటకొచ్చి జనం ఒకచోట గుమిగూడటమన్నది- ఆసేతు హిమాచలం మూసివేత తాలూకు మౌలిక లక్ష్యాన్ని దెబ్బతీసేదే!

విస్తరణ తీరు భయానకం

విశ్వవాప్తంగా, కొవిడ్‌-19 పేరిట వ్యవహరిస్తున్న కరోనా వైరస్‌ విస్తరించిన వేగం భీతి గొలుపుతోంది. తొలి లక్ష కేసుల నమోదుకు 67 రోజులు పట్టగా- తరవాతి 11 రోజుల్లోనే అవి రెండు లక్షలకు, ఆపై నాలుగు రోజుల్లోనే మూడు లక్షలకు చేరాయి. పిమ్మట నాలుగు రోజుల్లోనే వాటి సంఖ్య అయిదు లక్షలకు మించిపోయింది.

అత్యధిక కేసులు నమోదైన జాబితాలో చైనా, ఇటలీలను తలదన్ని అగ్రస్థానానికి ఎగబాకిన అమెరికాలో ఇప్పుడు కరోనా సోకిన రోగులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. తొలి దశలో కఠిన చర్యలు తీసుకోవడంలో అలసత్వం కనబరచిన బ్రిటన్‌ త్వరలోనే మరో ఇటలీ కానున్నదన్న విశ్లేషణలు- అనవసర జాప్యానికి ఎంతటి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో సోదాహరణంగా చాటుతున్నాయి.

కార్యాచరణ అవసరం

ఆధునిక వైద్యసదుపాయాలు అందుబాటులో ఉన్న అమెరికా, ఇటలీ, బ్రిటన్‌ వంటిచోట్ల దాపురించిన దుస్థితి- ఆరోగ్య సేవలు అంతంత మాత్రమైన భారత్‌లో పునరావృతమైతే, అక్కడికన్నా ఎన్నో రెట్ల సంక్షోభం కమ్మేసి జాతి నవనాడుల్నీ కుంగదీస్తుంది. అంతటి మహావిషాదాన్ని మొగ్గ దశలోనే సమర్థంగా నిలువరించాలంటే, మూసివేత నిర్ణయం ఒక్కటే సరిపోదు. సత్వర చర్యలు కొరవడితే, జనసాంద్రత అత్యధికమైన ఇండియాలో-30 కోట్లమందిని కరోనా బలిగొనే ముప్పు పొంచి ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలు, తక్షణ కార్యాచరణ ఆవశ్యకతను ఎలుగెత్తుతున్నాయి. కరోనా తాకిడి నుంచి జనభారతాన్ని సంరక్షించుకోవడానికి సామాజిక దిగ్బంధాన్ని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. దేశీయంగా పరిస్థితి చెయ్యి దాటిపోకుండా కాచుకోవాలంటే, జనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లనుంచి బయటకు వచ్చి రోడ్డెక్కకుండా నిరోధించాలి. మూసివేత గడువు పూర్తయ్యేదాకా, ప్రజానీకానికి కావాల్సిన అత్యవసర వస్తు సంబారాలన్నీ వారి ముంగిళ్లకే చేరవేసే బృహత్తర ప్రణాళికను తు.చ. తప్పక అమలుపరచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వసన్నద్ధం కావాలి!

దేశంలో విరుద్ధ దృశ్యాలు

జనవరి 23వ తేదీ నుంచి దాదాపు 76కోట్ల మంది గృహావరణానికే పరిమితం కావాలని నిర్దేశించిన చైనాలో, ఇళ్లకు వస్తుసరఫరా నిరంతరాయంగా సాగింది. అందుకు విరుద్ధ దృశ్యాలిక్కడ క్షేత్రస్థాయి పంపిణీలో ప్రతిబంధకాల్ని మూన్నాళ్లుగా కళ్లకు కడుతున్నాయి. గమ్యం చేరే దారి కానరాక జాతీయ రహదారులపై భారీ వాహనాలెన్నో నిలిచిపోయాయి. పోలీసు వేధింపులు దుర్భరంగా ఉన్నాయన్నది సరకు పంపిణీ ఏజెంట్లు, ఇ-వాణిజ్య సంస్థల ఆరోపణ. సరకు రవాణా సజావుగా సాగేలా కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీచేసినా, జిల్లాస్థాయి అధికారుల తోడ్పాటు కొరవడి- డబ్బాల్లో నిల్వచేసిన ఆహారోత్పత్తులు ఎక్కడికక్కడ ఆగిపోయాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి, కరోనా కారణంగా ఉత్పన్నమైన విపత్కర పరిస్థితి నేపథ్యంలో- పలు వ్యాపార సంస్థలు వెబ్‌సైట్లు నిర్వహిస్తూ ఆన్‌లైన్‌ విక్రయాలకు ఓటేస్తున్నాయి. ప్రస్తుతం నిత్యావసరాల ఆర్డర్లకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు అమెజాన్‌, పేటీఎమ్‌ మాల్‌, ఫ్లిప్‌కార్ట్‌ చెబుతుండగా- వ్యవస్థాగత సహకారం లభిస్తే దేశంలోని 150 పెద్ద నగరాల్లో కిరాణా సరఫరాలకు 'స్విగ్గీ' సై అంటోంది. పంజాబులో ఇప్పటికే ఆ నమూనా విజయవంతంగా అమలవుతోంది!

ఇళ్లకు అందిస్తేనే సరి

కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కోవడంలో దక్షిణ కొరియా, తైవాన్‌, చైనా- కృత్రిమ మేధ, బిగ్‌డేటాలను సమయానుగుణంగా వినియోగించుకున్నాయి. డ్రోన్ల ద్వారా మందుల చేరవేతనూ చూశాం. వాటి అనుభవాలే విలువైన పాఠాలుగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సంక్షోభ కాల ప్రణాళికలు రాటుతేలాలి. దేశవ్యాప్తంగా అత్యవసర నిర్బంధంలో ఉన్న పల్లెలు, పట్టణాలు, నగరాల్లో జనావాసాలన్నింటికీ కావాల్సిన రోజువారీ వినియోగ వస్తువులు, కూరగాయలు, మందులు ఎవరిళ్లలో వారికి అందించే పకడ్బందీ ఏర్పాట్లే- జాతిని క్షేమంగా గట్టెక్కించగలుగుతాయి!

ఇదీ చదవండి: కరోనాపై పోరుకు ఉపరాష్ట్రపతి నెల జీతం విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.