దేశ రాజధాని దిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకెళుతున్నట్లు తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తాము తీసుకునే ప్రతి నిర్ణయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భాగస్వాములవుతున్నారని తెలిపారు. కేంద్రంపై కొన్ని రాజకీయ ప్రకటనలు చేసినప్పటికీ.. కరోనా పోరులో తీసుకునే నిర్ణయాలపై అవి ఎలాంటి ప్రభావం చూపవన్నారు.
" దిల్లీలో జులై చివరి నాటికి 5.5 లక్షలకుపైగా కేసులు నమోదవుతాయని ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రకటన చేసినా.. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హోంశాఖ సహాయం అందించాలని ప్రధాని మోదీ కోరారు. ప్రధాని సూచన మేరకు సమన్వయ సమావేశం నిర్వహించి.. కంటైన్మెంట్ జోన్లలో ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించటం సహా.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. దిల్లీలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రజలు ఆందోళనకు గురికావద్దు. పరీక్షల సామర్థ్యాన్ని 4 నుంచి 5 రెట్లు పెంచాం."
- అమిత్ షా, కేంద్రం హోంమంత్రి
భయానక పరిస్థితి నుంచి..
దిల్లీలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన బాధితుల మృతదేహాల పరిస్థితి భయంకరంగా ఉండేదన్నారు షా. 350కిపైగా మృతదేహాలు అంత్యక్రియల కోసం పెండింగ్లో ఉంటే.. రెండు రోజుల్లో వారి మతాచారాల ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేయాలని ఆదేశించినట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఒక్క మృతదేహం కూడా నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం లేదని వెల్లడించారు.