కేరళ కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్-కోజికోడ్ ఎయిర్ ఇండియా విమానం (IX-1344) అదుపుతప్పింది. ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై జారుతూ 30 అడుగుల లోయలో పడింది. ప్రమాదం ధాటికి విమానం రెండు ముక్కలైంది. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఘటనా సమయంలో భారీ వర్షం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.
దుబాయ్ నుంచి సాయంత్రం 7.40 గంటల ప్రాంతంలో కోజికోడ్ చేరుకున్న బోయింగ్ 737 విమానం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై అదుపుతప్పినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 191 ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఐదుగురు చనిపోయారు. 100 మందికిపైగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
విమాన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ).
అన్నిరకాల సహాయక చర్యలు చేపట్టాలని పోలీసులు, అగ్నిమాపక విభాగాన్ని ఆదేశించారు ముఖ్యమంత్రి పినరయి విజయన్.
ఘటనపై విచారం వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: వధువు ఫొటోషూట్‌లో 'లెబనాన్ పేలుడు' దృశ్యాలు