ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణం జరిగింది. నవంబర్ 6న తప్పిపోయిన ఆరేళ్ల బాలిక పిలిభిత్ జిల్లాలోని మాధో తాండలో శవమై కనిపించింది. ఆమెపై బలత్కారం చేసి హత్య చేశారు కిరాతకులు. బాలిక గొంతు నులిమి చంపేశారు.
ఓ మతపరమైన కార్యక్రమానికి వెళ్లిన బాలిక నవంబర్ 6న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదు మేరకు అపహరణ, అనుమానాస్పద మానభంగం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నామని పిలిభిత్ ఎస్పీ జైప్రకాశ్ యాదవ్ తెలిపారు. తర్వాతి రోజు ఉదయం బాలిక ఇంటి దగ్గర్లోని ఓ చెరకు తోటలో మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు. అనంతరం శవపరీక్షకు పంపించామని... బాలికను రేప్ చేసి గొంతు నులిమి చంపినట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలిందని స్పష్టం చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఘటనా స్థలంలో యువకుడి చెప్పు లభించిందని పోలీసులు తెలిపారు. అతన్ని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.
'బలవంతంగా అంతిమ సంస్కారాలు'
మరోవైపు రాష్ట్ర మాజీ హోంమంత్రి, సమాజ్వాదీ పార్టీ నేత హేమ్రాజ్ వర్మ.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితురాలి మృతదేహానికి పోలీసులు బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు యత్నించారని ఆరోపించారు.
'తమకు న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని బాధితురాలి తల్లి చెప్పారు. కానీ బలవంతంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాలని పోలీసులు అనుకున్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోంది' అని అన్నారు.