దేశంలో శరవేగంగా పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తికి బ్రేక్ వేయడమే లక్ష్యంగా కేంద్రం మరింత దృష్టిసారిస్తోంది. ఇందులో భాగంగా అధికంగా మరణాల రేటు, పాజిటివ్ కేసులు నమోదవుతున్న జిల్లాలను గుర్తించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.. కరోనా మరణాల రేటు, పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ఎనిమిది రాష్ట్రాల్లోని 13 జిల్లాల అధికార యంత్రాంగంతో రెండు రోజుల పాటు వర్చువల్ సమావేశం నిర్వహించారు. మరణాల రేటు తగ్గించడం, కరోనాకు కళ్లెం వేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా దేశంలో 13 జిల్లాలపై దృష్టిసారించినట్టు ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
అత్యధికంగా ఉన్న జిల్లాలివే..
- అసోంలోని కామ్‌రూప్ మెట్రో
- బిహార్‌లోని పట్నా
- ఝార్ఖండ్‌లోని రాంచీ
- కేరళలోని అలప్పుజ, తిరువనంతపురం
- ఒడిశాలోని గంజాం
- యూపీలోని లఖ్‌నవూ
- బంగాల్లో ఉత్తర 24 పరగణాలు, హుగ్లీ, హావ్‌డా, కోల్‌కతా, మాల్దా
- దిల్లీ
14 శాతం మరణాలు ఈ జిల్లాల్లోనే..
దేశంలోని మొత్తం యాక్టివ్ (29.64%) కేసుల్లో 9 శాతం, అలాగే, ఇప్పటివరకు నమోదైన 42,518 మరణాల్లో 14శాతం ఈ జిల్లాల్లోనే ఉన్నట్టు గుర్తించారు. దీంతో పాటు ప్రతి మిలియన్ జనాభాకు తక్కువ పరీక్షలు జరగడంతో పాటు వ్యాధి నిర్ధరణ శాతం అధికంగా ఉన్నట్టు తేలింది. కామ్‌రూప్ మెట్రో, లఖ్‌నవూ, తిరువనంతపురం, అళప్పుజ ఈ నాలుగు జిల్లాల్లో రోజువారీ కొత్త కేసుల్లో పెరుగుదల ఉన్నట్టు గుర్తించారు. ఈ నెల నిన్న, ఈ రోజు రెండు రోజులపాటు కొనసాగిన ఈ సమావేశంలో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు, జిల్లా సర్వైలెన్స్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, పురపాలక కమిషనర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'మహా'లో 5 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు