Friend Stabbed to Death: కర్ణాటక బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. రూ. 50 కోసం ఇద్దరు స్నేహితుల మధ్య మొదలైన గొడవ.. ఒకరి ప్రాణం బలితీసుకుంది. ఈ ఘటన బసవేశ్వర సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుబరహళ్లిలో మంగళవారం రాత్రి జరిగింది. నిందితుడు శాంతకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ జరిగింది: శివమధు, శాంతకుమార్ మంచి స్నేహితులు. చిన్నప్పటినుంచి కురుబరహళ్లిలో కలిసే పెరిగారు. కొన్నేళ్ల క్రితం లగ్గెరె బ్రిడ్జ్ ప్రాంతానికి మారారు. శాంతకుమార్.. జొమాటో డెలివరీ బాయ్‌గా, శివమధు ఆటో డ్రైవర్‌గా పనిచేసేవారు. ఎప్పటిలానే మంగళవారం సాయంత్రం కూడా ఇరువురూ కురబరహళ్లికి క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. ఆట అయిపోయిన తర్వాత రాత్రి 8 గంటల ప్రాంతంలో.. సమీపంలోని సైబర్ సెంటర్‌కు వెళ్లారు.
అప్పుడే శాంతకుమార్ జేబులో నుంచి రూ. 50 తీసుకున్నాడు శివమధు. డబ్బులు ఎందుకు తీసుకున్నావని ప్రశ్నించాడు శాంత. ఇదే వివాదానికి కారణమైంది. ఇరువురు గొడవపడ్డారు. తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన శాంతకుమార్.. శివమధును కత్తితో పొడిచి పారిపోయాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు ప్రకటించారు వైద్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు శాంతకుమార్ కోసం గాలిస్తున్నారు.

ఇవీ చూడండి: బిహార్ టు కశ్మీర్.. మోదీ వచ్చాకే కూలుతున్న ప్రభుత్వాలు.. ఇలా ఎన్నో!
మనుషుల్ని చంపి.. మామిడి చెట్టెక్కి నిద్రిస్తున్న చిరుత.. భయంభయంగా జనం