కర్ణాటకకు చెందిన ఓ ఆటోడ్రైవర్‌కు బెల్జియంకు చెందిన ఓ యువతితో ఘనంగా వివాహం జరిగింది. ఇరువురి కుటుంబసభ్యుల ఆమోదంతో.. దేవుడి సాక్షిగా ఒక్కటైంది ఈ జంట. ఈ పెళ్లితో వారి నాలుగేళ్ల ప్రేమ కథకు శుభాం కార్డు పడి.. భార్యాభర్తలుగా మారారు. భారతీయ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లికి యువతి కుటుంబసభ్యులు కూడా ఆమోదం తెలపడం విశేషం.
విజయనగర్‌కు చెందిన అనంతరాజు అనే ఆటోడ్రైవర్‌కు.. కెమిల్ అనే ఫారినర్‌తో శుక్రవారం ఉదయం అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అనంతరాజు ఆటో నడుపుతూ.. ప్రపంచ ప్రసిద్ధ హంపి దేవాలయంలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేసేవాడు. నాలుగేళ్ల క్రితం బెల్జియంకు చెందిన జీప్ ఫిలిప్ కుటుంబం హంపికి విహారయాత్రకు వచ్చారు. ఈ సమయంలో వారికి అనంతరాజు ఎంతగానో సహాయం చేశాడు. ఆ కుటుంబానికి రాజు మంచితనం ఎంతో నచ్చి.. ఫిలిప్ మూడో కుమారై కెమిల్ అతనితో స్నేహం చేసింది. ఆ స్నేహం కాస్తా కొన్ని రోజులకు ప్రేమగా మారింది. కెమిల్ బెల్జియంలో ఓ సామాజిక కార్యకర్త.
ఇరువురి కుటుంబసభ్యులు వారి ప్రేమకు అడ్డుచెప్పకపోగా ఇద్దరికీ వివాహం చేయాలని నిశ్చయించారు. మూడేళ్ల క్రితమే వారి వివాహం జరగాల్సి ఉంది. కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. ముందుగా కెమిల్ కుటుంబసభ్యులు బెల్జియంలో పెళ్లిని ఘనంగా చేయాలని అనుకున్నారు. కానీ అనంతరాజు కుటుంబసభ్యులు.. హిందూ సంప్రదాయంలోనే వివాహం జరిపించాలని కోరారు. ఇందుకు ఫిలిప్ కుటుంబం అంగీకరించింది. శుక్రవారం ఉదయం 9:25 గంటలకు ఇరువురి కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో.. హంపిలోని విరూపాక్షేశ్వరుని సన్నిధిలో అంగరంగ వైభవంగా కల్యాణం జరిగింది.