కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్.. బొమ్మైతో ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం యడియూరప్ప సహా.. పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ప్రధాని శుభాకాంక్షలు..
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ప్రమాణం చేసిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మైకు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతమైన చట్టసభ నిర్వహణ, పరిపాలన అనుభావాన్ని తీసుకొచ్చారని ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. బలమైన ప్రభుత్వాన్ని బొమ్మై నిర్మిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాక.. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప చేసిన కృషిని మోదీ కొనియాడారు.
యడ్డీని కలిసి..
ప్రమాణస్వీకారానికి ముందు కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను బొమ్మై కలిశారు. ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.
ఉదయం నుంచే పూజలు..
కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న క్రమంలో బసవరాజ్ బొమ్మై ఉదయమే.. బెంగళూరులోని భగవాన్ శ్రీ మారుతీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గొప్ప మనసున్న నేత..
బసవరాజ్ బొమ్మై గొప్ప మనసున్న నేత. కరోనా రెండో దశలో ఆయన చేసిన సేవ ఇందుకు ఉదాహరణ. కర్ణాటకలో ఎన్నడూ లేనివిధంగా కరోనా కేసులు వెలుగుచూసిన మే నెలలో.. హోం మంత్రి బసవరాజ్ బొమ్మై తన నివాసాన్నే కొవిడ్ కేర్ సెంటర్(సీసీసీ)గా మార్చారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక మంత్రి తన నివాసాన్ని కొవిడ్ కేంద్రంగా మార్చినట్లు ఆయన కార్యాలయం ఆనాడు పేర్కొంది.
తండ్రి బాటలో..
కర్ణాటక పూర్వ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మై తనయుడైన బసవరాజ్- ఒకటిన్నర దశాబ్దాల కిందట జనతాదళ్ నుంచి భాజపాకు వలసవచ్చారు. ఇటీవలి దాకా హోంశాఖ మంత్రిగా ఉన్న ఆయనకు సామాజిక నేపథ్యమే నిచ్చెనమెట్టుగా అక్కరకొచ్చింది. లింగాయతులపై గట్టి పట్టున్న ప్రజాకర్షక నేత యడ్డీ స్థానాన్ని మరో వర్గం నాయకుడితో భర్తీ చేస్తారనే వార్తలు తొలుత వ్యాపించినా- భాజపా పెద్దలు అంతటి సాహసానికి ఒడిగట్టలేదు. లింగాయత్ ఓటుబ్యాంకును దూరం చేసుకుంటే అసలుకే మోసమొస్తుందన్న ముందుజాగ్రత్తతోనే ఇప్పుడు బొమ్మైకి పట్టంకట్టారు.
ఇవీ చదవండి:
కర్ణాటక నూతన సీఎం రాజకీయ ప్రస్థానమిదే..