బిహార్‌లో కొందరు ఉపాధ్యాయులు రాసిన లీవ్ లెటర్లు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఇలా కూడా లీవ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చా అంటూ ఆశ్చర్యపడుతున్నారు.
బాంకా జిల్లాలోని కచారి పిప్రా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు లీవ్ కోసం తాను పనిచేస్తున్న.. స్కూల్ ప్రిన్సిపల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందులో.. 'ప్రిన్సిపల్ సార్.. మా అమ్మ డిసెంబరు 5వ తేదీ రాత్రి 8 గంటలకు చనిపోతారు. అందుకే ఆమె అంత్యక్రియల కోసం.. డిసెంబర్ 6,7న సెలవు కావాలి. దయచేసి సెలవు ఇవ్వండి' అని కోరారు.
నాకు ఆరోగ్యం బాలేదు..
బరాహత్‌లోని ఖాదియారా ఉర్దూ విద్యాలయ ఉపాధ్యాయుడు రాజ్‌గౌరవ్ రాసిన మరో లేఖ వైరల్ అవుతోంది. 'నాలుగు రోజుల తర్వాత నాకు ఆరోగ్యం బాగోదు.. అందుకే ముందుగానే సెలవు కావాలి. డిసెంబర్ 4,5 తేదీల్లో నాకు సెలవు ఇవ్వండి' అని పాఠశాల ప్రధానోపాధ్యాయుడుకి లేఖ రాశారు.
![banka teacher strange leave application](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3_0212newsroom_1669971251_600.jpg)
పెళ్లికి వెళ్తా..
కటోరియాకు చెందిన నీరజ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు క్యాజువల్ లీవ్ కోసం స్కూల్ ప్రిన్సిపాల్‌ను దరఖాస్తు చేసుకున్నారు. ' నేను పెళ్లికి వెళ్లాలి.. అక్కడ భోజనం బాగా చేస్తాను. అప్పుడు కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకు డిసెంబరు 7న లీవ్ మంజూరు చేయండి.' అని కోరాడు.
![banka teacher strange leave application](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5_0212newsroom_1669971251_494.jpg)
ఇలాంటి వింత లీవ్ లెటర్లు రావడానికి భాగల్పుర్ కమిషనర్ దయానిధన్ పాండే చేసిన ఉత్తర్వులే కారణమని తెలుస్తోంది. ఎందుకంటే కమిషనర్ పాఠశాలలను తనిఖీ చేసిన సమయంలో.. ఒకే పాఠశాలలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వడం వలన విద్యాబోధనపై ప్రభావం పడినట్లు ఆయన గుర్తించారు. దీంతో ఉపాధ్యాయులు సెలవులు తీసుకునే ముందు.. తప్పని సరిగా లీవ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నవంబర్ 29న ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉపాధ్యాయులు రకరకాలుగా దరఖాస్తులు పెట్టుకుంటున్నారు.
![banka teacher strange leave application](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4_0212newsroom_1669971251_63.jpg)