కర్ణాటకలో అమానవీయ ఘటన జరిగింది. బెంగళూరులోని మాగడి ప్రాంతంలో బైకర్.. ఓ వృద్ధుడిని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. రాంగ్రూట్లో వచ్చిన స్కూటీ రైడర్.. సుమోను ఢీకొట్టడం, అనంతరం తలెత్తిన ఘర్షణే ఈ దారుణానికి దారితీసింది. నిందితుడిని సహీల్గా గుర్తించారు. అతడి వయసు 25 అని, నాయన్దహళ్లిలో నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు ముత్తప్ప కారు డ్రైవర్ అని.. అతడి వయసు 71 అని చెప్పారు. ప్రస్తుతం ముత్తప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే..
బైకర్ సహీల్ రాంగ్రూట్లో వచ్చి ముత్తప్ప నడుపుతున్న టాటా సుమోను ఢీకొట్టాడు. దీంతో సుమో డ్రైవర్ ముత్తప్ప.. వాహనం దిగి సహీల్తో ఘర్షణ పడ్డాడు. సుమో మరమ్మతులకు అయ్యే ఖర్చులు భరించాలని డిమాండ్ చేశాడు. వాగ్వాదం జరుగుతుండగానే సహీల్ తన స్కూటీతో సహా పారిపోయేందుకు ప్రయత్నించాడు. స్కూటీని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా వాహనాన్ని వెనక గట్టిగా పట్టుకున్నాడు సుమో డ్రైవర్ ముత్తప్ప. అయినప్పటికీ అలాగే ముందుకు పోయిన బైకర్.. ముత్తప్పను ఈడ్చుకెళ్లాడు. కిలోమీటర్ వరకు ఇలాగే బైక్‌ను పోనిచ్చాడు.
సుమో డ్రైవర్‌ను బైకర్ ఈడ్చుకెళ్తున్న సమయంలో అదే రహదారిపై వెళ్తున్న కొందరు వీడియో తీశారు. స్కూటీ డ్రైవర్‌ను వెంబడించారు. బైకర్‌ను అడ్డుకొని.. అతడికి దేహశుద్ధి చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విజయనగర పోలీసులు రంగంలోకి దిగి.. కేసు నమోదు చేసుకున్నారు. సెల్ఫోన్లో రికార్డైన వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.