Balakrishna Comments on Junior NTR: ఆంధ్రప్రదేశ్‌లో సైకో పరిపాలన నడుస్తోందని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. ఇక్కడ ప్రజా సంక్షేమం గాలికి వదిలి.. ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టే రాజకీయం కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 17ఏ సెక్షన్ పాటించకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేంద్రం హస్తం ఉందో లేదో తనకు అవగాహాన లేదని తెలిపిన ఆయన... అనవసరంగా ఎవరిపైనా తాము నిందలు వేయమని వెల్లడించారు. కేంద్రం కల్పించుకోవాల్సిన సమయంలో... వారు మాట్లాడకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తన అక్క పురందేశ్వరితో టచ్‌లో ఉన్నామని బాలకృష్ణ వెల్లడించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంశంపై తప్పకుండా కేంద్రాన్ని కలుస్తానని తెలిపారు. సినిమా వాళ్లు స్పందించక పోవడంపై తాను పట్టించుకోనని.. ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అన్నారు.
త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయని... ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ జపం మొదలుపెట్టారని బాలకృష్ణ తెలిపారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు హయాంలో చేసిన తెలంగాణ అభివృద్ధి కలిసి వస్తుందని వెల్లడించారు. చంద్రబాబు నిజాయితీ గురించి ప్రతిఒక్కరికీ తెలుసన్నారు. రాజకీయ కక్షతోనే ఆయనపై అబద్ధపు కేసులు పెట్టారని బాలకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబును రిమాండ్‌లోకి తీసుకున్న అనంతరం సెక్షన్‌లు చెబుతున్నారని బాలకృష్ణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ ను ప్రతిఒక్కరూ ఖండిస్తున్నారని వెల్లడించారు. కానీ, తెలంగాణలో 3 రోజుల నుంచి చంద్రాబాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారని.. కేవలం ఓట్ల కోసమే ఇక్కడ ఎన్టీఆర్ జపం చేస్తున్నారంటూ బాలకృష్ణ ఆరోపించారు. తెలంగాణలో టీడీపీ ఇంతకాలం అజ్ఞాతంలో ఉందని.. ఇకపై టీటీడీపీలో మళ్లీ చైతన్యం వస్తోందని పేర్కొన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాకుండా... తెలుగు వారి గౌరవం కోసం పని చేద్దామంటూ బాలకృష్ణ పిలుపునిచ్చారు.
Balakrishna Interesting Comments : 'తెలంగాణలో టీడీపీ లేదన్న వారికి మేమేంటో చూపిస్తాం'
తమ పార్టీ కేసులు, అరెస్ట్‌లకు భయపడదని, తమకు న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని బాలకృష్ణ వెల్లడించారు. అక్రమ అరెస్ట్‌లపై ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉద్రిక్తత సృష్టిస్తున్నారని.. అనడం సరి కాదన్న ఆయన.. తెలంగాణ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడుతుందని బాలకృష్ణ తెలిపారు. తెలంగాణలో అంతా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో టీడీపీ పునర్వైభవానికి ప్రతి క్షణం పోరాడతామని బాలకృష్ణ వెల్లడించారు. పొత్తుల గురించి చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. తెలంగాణలో టీడీపీ లేదనేవారికి తామేంటో చూపిస్తామని హెచ్చరించారు.