ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: ఆంగ్లేయుల అరాచకాలను ప్రపంచానికి చెప్పినందుకు..

Azadi Ka Amrit Mahotsav: భారత్‌లో బ్రిటిష్‌ ప్రభుత్వ అరాచకాలపై నల్ల జెండాలెత్తిన వారిలో కొందరు తెల్లవారూ ఉన్నారు. వారిలో అత్యంత ప్రభావం చూపిన ఇంగ్లాండ్‌లోని సామాన్య బ్రిటిషర్లనూ ఆలోచనలో పడేసిన... ఇంటాబయటా బ్రిటిష్‌ సర్కారును దోషిగా నిలబెట్టిన.. అరుదైన కలం యోధుడు బి.జి.హార్నిమన్‌! ఆంక్షలను బేఖాతరు చేస్తూ అత్యంత దారుణమైన మారణకాండను ప్రపంచానికి చాటిన ఈ పాత్రికేయుడిని ఏమీ చేయలేక ఓడెక్కించి లండన్‌ పంపించింది బ్రిటిష్‌ ప్రభుత్వం! కానీ ఆయన దొడ్డిదారిన మళ్లీ వచ్చి స్వతంత్ర భారత్‌లో కన్నుమూశారు.

Azadi Ka Amrit Mahotsav
స్వాతంత్ర్య అమృత మహోత్సవం
author img

By

Published : Dec 1, 2021, 9:29 AM IST

Azadi Ka Amrit Mahotsav: అనిబిసెంట్‌లాంటి వారిలా సామాన్య ప్రజలకు పరిచయం లేని పేరు హార్నిమన్‌. కానీ భారత స్వాతంత్య్రం కోసం, భారత్‌లో పత్రికా స్వేచ్ఛ కోసం ఆయన చేసిన కృషి అసామాన్యం! తన రాతలతో కొరకరాని కొయ్యలా మారిన... ఆయన్ను వదలించుకోవటానికి ఆంగ్లేయ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు.

ఇంగ్లాండ్‌లో పాత్రికేయుడిగా ప్రస్థానం ఆరంభించిన హార్నిమన్‌ 1906లో కోల్‌కతాలోని స్టేట్స్‌మన్‌ పత్రికకు న్యూస్‌ ఎడిటర్‌గా భారత్‌లో అడుగుపెట్టారు. రాగానే తమ తెల్లవారి దాష్టీకాలను అర్థం చేసుకున్న ఆయన... భారతీయుల పక్షాన నిలబడ్డారు. బెంగాల్‌ విభజనను నిరసిస్తూ ఉద్యమంలో పాల్గొన్నారు. 1913లో ముంబయి క్రానికల్‌ పత్రికకు ఎడిటర్‌గా ముంబయికి మారారు. అప్పటిదాకా సంపన్నవర్గాల వార్తలే ప్రచురించే పత్రికలో... సామాన్యులకూ స్థానమిచ్చి వారి సమస్యలను లేవనెత్తేవారు. ప్రభుత్వ తీరును ఎండగట్టడమేగాకుండా... స్థానికులను దోచుకుంటున్నారంటూ భారత్‌లోని ఆంగ్లవ్యాపారుల తీరుపైనా ఆయన విమర్శలు గుప్పించేవారు. దీంతో... ఆంగ్లేయ అధికారులకు, వ్యాపారులకు హార్నిమన్‌ శత్రువుగా మారారు. భారత్‌లో పత్రికా స్వేచ్ఛను కోరుతూ... ప్రెస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాను ఆరంభించారు. 1919లో గాంధీ పిలుపు మేరకు రౌలత్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమంలో పాల్గొన్న ఆయన... జలియన్‌వాలాబాగ్‌ ఘటన తర్వాత పాత్రికేయుడిగా తన విశ్వరూపం ప్రదర్శించారు.

1919 ఏప్రిల్‌లో జరిగిన జలియన్‌వాలాబాగ్‌ ఊచకోతను ప్రపంచానికి తెలియకుండా బ్రిటిష్‌ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. పత్రికల్లో వార్తలు, ఫొటోలు రాకుండా ఆంక్షలు విధించింది. కానీ మార్షల్‌లా ఆంక్షలను తోసిరాజంటూ... తమ స్థానిక విలేకరి లాలా గోవర్ధన్‌దాస్‌ ప్రత్యక్షంగా అందించిన వివరాలను హార్నిమన్‌ ముంబయి క్రానికల్‌లో ప్రచురించారు. ఇంగ్లాండ్‌కూ పంపించారు. రహస్యంగా ఫొటోలను సైతం లండన్‌కు చేరవేశారు. అక్కడి ది డైలీ హెరాల్డ్‌లో ఈ ఊచకోత ఫొటోలు, వార్తలు రావటంతో యావత్‌ ప్రపంచానికి భారత్‌లో ఆంగ్లేయుల దారుణం కళ్లకు కట్టినట్లు తెలిసిపోయింది. కథనం రాసిన గోవర్ధన్‌దాస్‌ను అరెస్టు చేసి మూడేళ్లు జైలుకు పంపిన బ్రిటిష్‌ ప్రభుత్వం... తమ వాడైన హార్నిమన్‌ను ఏమీ చేయలేకపోయింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నా... బలవంతంగా ఓడెక్కించి లండన్‌కు తిరిగి పంపించేసింది.

అక్కడికి వెళ్లినా భారత తరఫున పోరాటాన్ని విడిచిపెట్టలేదాయన. జలియన్‌వాలాబాగ్‌ ఊచకోతకు కారణమైన డయ్యర్‌ తీరును తప్పుపట్టిన హార్నిమన్‌ తన దేశవాసులను పునరాలోచించేలా కథనాలు రాశారు.
భారత్‌కు తిరిగి వచ్చేందుకు ఆయన ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా బ్రిటిష్‌ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో... 14 సంవత్సరాల తర్వాత ఓరోజు లండన్‌ నుంచి కొలంబోకు చేరుకున్న ఆయన... అక్కడి నుంచి భారత్‌కు వచ్చారు. కోర్టు సమర్థించడంతో ప్రభుత్వం ఏమీచేయలేక పోయింది. అలా ఇక్కడే ఉండిపోయిన హార్నిమన్‌ భారత స్వాతంత్య్ర ఆవిర్భావానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. 1941లో కరంజియా, దిన్‌కర్‌ నాద్‌కర్ణిలతో కలసి తొలి వీక్లీ టాబ్లాయిడ్‌ 'బ్లిట్జ్‌'ను స్థాపించిన ఈ ఆంగ్లేయుడు భారతీయుడిగా 1948 అక్టోబరులో కన్నుమూశారు.

"భారత్‌కు స్వాతంత్య్ర మంత్రం నేర్పిన ఉదాత్త ఆంగ్లేయుడు హార్నిమన్‌. ఆయన సేవల్ని భారత్‌ ఎన్నటికీ మరచిపోలేదు" అని గాంధీజీ కొనియాడారు.

మన ఆంగ్లేయ అధికారులు అపరిమిత అధికారాలతో భారత్‌లో పాల్పడుతున్న తీవ్రవాద చర్యలను చూసి కూడా మౌనంగా ఉంటే.. న్యాయాన్ని గౌరవించే వారమని మనం ఎలా చెప్పుకోగలం? మానవత, ప్రేమ మనలో ఉన్నాయని ఎలా అనుకోగలం?' అని ఇంగ్లాండ్‌ ప్రజల్లో హార్నిమన్‌ ఆలోచన రేకెత్తించారు.

ఇదీ చూడండి: భారత పౌరసత్వానికి ఆరు లక్షల మంది గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.