Ayodhya Ram Mandir Pran Pratishtha : అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవాల సందర్భంగా శ్రీరాముని జీవితంలోని కీలక ఘట్టాలను తెలిపే విధంగా శోభాయాత్ర నిర్వహించనున్నారు. సుమారు 100 విగ్రహాలతో అయోధ్యలో ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి గుర్తుగా జనవరి 17 శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. వారం రోజులపాటు జరిగే రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్ఠాపనా మహోత్సవాలను ఈ శోభాయాత్రతోనే శ్రీకారం చుట్టనున్నారు. శ్రీరాముని జననం నుంచి వనవాసం, లంకపై విజయం, అయోధ్యకు తిరిగి రావడం వంటి కీలక ఘట్టాలు తెలిపే విధంగా విగ్రహాలు ఉంటాయని ప్రధాన శిల్పి రంజిత్ మండల్ తెలిపారు.
"ఈ విగ్రహాలను తయారు చేసే అవకాశం నాకు లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. వివిధ దశల్లో మొత్తం 100 విగ్రహాలను ప్రదర్శిస్తారు. వీటిలో ఇప్పటి వరకు 60 విగ్రహాలు సిద్ధం చేశాం."
-రంజిత్ మండల్, ప్రధాన శిల్పి
నూతనంగా నిర్మించిన రామమందిర గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాన్ని ఉంచుతారు. పాలరాతితో చేసిన తామరపుష్ప సింహాసనంపై రామ్ లల్లా విగ్రహాన్ని ఉంచనున్నారు. శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు రామ్‌లల్లా నుదిటిని తాకి, గర్భగుడిని కాంతిమయం చేసేవిధంగా సింహాసనం ఎత్తును నిర్ణయించనున్నారు. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు వందలాది మంది ప్రముఖులు హాజరుకానున్నారు.
రామమందిర పూర్తికి మరో మూడేళ్లు
మరోవైపు అయోధ్య రామమందిరం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరో మూడేళ్లు పడుతుందన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ మహంత్ గోవింద్ గిరిదేవ్. మహారాష్ట్ర పుణెలో శ్రీరాముడికి వస్త్రాలు నేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. "రామజన్మ భూమి అయోధ్యలో అద్భుతమైన రామమందిరం రూపుదిద్దుకుంటోంది. రామమందిర ఉనికిని కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆలయం నిర్మించినప్పటికీ, ఎందుకు ధ్వంసమయిందనే విషయాన్ని అందరూ ఆలోచించాలి. అయోధ్యలో రామమందిరం నిర్మించడమే కాదు పౌరుల్లో బలమైన జాతీయవాదాన్ని నిర్మించాలి. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మందిరాన్ని నిర్మిస్తున్నారని కొందరు అంటున్నారు. చూసే కోణాన్ని బట్టి వారి ఆలోచన ఉంటుంది. మాకు ఒకటే విధానం అది భక్తి. గత కొన్ని రోజులుగా శ్రీరాముడు ఓ టెంట్లో ఉంటున్నారు. ఆయనను త్వరగా జన్మస్థానానికి తీసుకురావాలి. మా వరకు ఇది రాజకీయం కాదు. కేవలం ఆధ్యాత్మికం మాత్రమే." అని గోవింద్ గిరిదేవ్ తెలిపారు.
'అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠకు దేశవ్యాప్తంగా సెలవు'- గర్భగుడి ఫొటో చూశారా?
అయోధ్య రాముడికి కొత్త అర్చకుల పూజలు!- 6నెలలపాటు ట్రైనింగ్- 30ఏళ్ల లోపు వారికే ఛాన్స్