Attack On Kejriwal House: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై దాడి జరిగింది. ఇటీవల విడుదలైన 'కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై కేజ్రీవాల్ అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు భాజపా కార్యకర్తలు. భాజపా ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. దిల్లీ సివిల్ లైన్స్‌లోని సీఎం ఇంటి బయట బారికేడ్లను తొలగించి ఆందోళనలు చేపట్టారు భాజపా కార్యకర్తలు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
'కేజ్రీవాల్‌ను టచ్ చేస్తే..': ఈ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. పంజాబ్‌లో ఆప్ ఘనవిజయం సాధించడం భాజపా జీర్ణించుకోలేకపోతుందని విమర్శించారు. అందుకే అరవింద్ కేజ్రీవాల్‌పై హత్యాయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌ను టచ్ చేయాలని చూస్తే.. దేశం సహించదని సిసోడియా హెచ్చరించారు.
ఇదీ చూడండి: మహిళ ఫోన్ కొట్టేసి చెట్టెక్కిన కోతి.. కాల్ రాగానే ఆన్సర్ చేసి...