అసోంలోని మారుమూల తెగకు చెందిన జాదవ్ పాయెంగ్.. ప్రకృతిపై ప్రేమతో అడవిని సృష్టించి 'ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా'గా పేరొందారు. అడవుల సంరక్షణకు ఎంతో కృషి చేసిన పాయెంగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ క్రమంలోనే మెక్సికో ప్రభుత్వం నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అక్కడికి వెళ్లనున్నారు పాయెంగ్.
అటవీ సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించటం, అడవుల శాతాన్ని పెంచేందుకు నడుంబిగించిన మెక్సికో.. జాదవ్ పాయెంగ్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. తమ దేశంలో 8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు పాయెంగ్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు జాదవ్‌తో కలిసి పాలుపంచుకోనున్నారు.
" 10 ఏళ్లలో 8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటాలని మెక్సికోలోని ఓ ఎన్జీఓ నాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం పదేళ్ల పాటు ప్రతి సంవత్సరం 3 నెలలు మెక్సికోలో ఉండనున్నాను."
- జాదవ్ పాయెంగ్, ఫారెస్ట్ మ్యాన్.
చిన్నతనం నుంచే..
అసోంలోని ములాయ్ కథోనీ గ్రామానికి చెందిన పాయెంగ్ అలియాస్ ములాయ్ 1979 నుంచి బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతంలో చెట్ల రక్షణ బాధ్యతలు చూసుకుంటూ.. ఒంటి చేత్తో పెద్ద అడవినే సృష్టించాడు. 2012లో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం 'ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా' బిరుదుతో సత్కరించింది. 2013లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు, 2015లో పద్మశ్రీ పురస్కారం వరించింది.
ఇదీ చూడండి: అటవీ సంరక్షణలో 'అతడే ఒక సైన్యం'