అసోం-మేఘాలయా సరిహద్దుల్లో మరోసారి హింస చెలరేగింది. అసోం పోలీసులు, మేఘాలయ ప్రజల మధ్య జరిగిన ఘర్షణలో అటవీ శాఖ గార్డ్ సహా ఆరుగురు మృతి చెందారు. పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో అక్రమంగా కలప రవాణా చేస్తున్న ట్రక్‌ను అసోంకు చెందిన అటవీ సిబ్బంది పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో అక్రమంగా కలపను తరలిస్తున్న ట్రక్‌ను ముక్రు ప్రాంతంలో అటవీ సిబ్బంది ఆపినట్లు పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ జిల్లా ఎస్పీ తెలిపారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా అటవీ సిబ్బంది ట్రక్ టైరుపై కాల్పులు జరిపినట్లు చెప్పారు.
ట్రక్ డ్రైవర్, మరో ఇద్దరు పట్టుబడగా మిగతా వారు తప్పించుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. అటవీ సిబ్బంది సూచన మేరకు అదనపు బలగాలను తరలించినట్లు చెప్పారు. ఈ విషయం తెలిసి ఉదయం 5గంటల ప్రాంతంలో మేఘాలయా నుంచి జనం ఆయుధాలు పట్టుకొని పెద్దసంఖ్యలో తరలివచ్చినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసిన సాయుధులు దాడికి దిగినట్లు చెప్పారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో అటవీ గార్డ్‌సహా ఆరుగురు చనిపోయినట్లు ఎస్పీ ప్రకటించారు. ఈ ఘటనను మేఘాలయ ప్రభుత్వం ఖండించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు.
ఇవీ చదవండి : 'శ్రద్ధను నేనే చంపా.. పోలీసులకు చెప్పినవన్నీ నిజాలే'.. కోర్టు ముందు అఫ్తాబ్
మతం మారలేదని యువకుడికి చిత్రహింసలు.. పెట్రోల్ పోసుకుని ప్రేయసిని హత్తుకున్న ప్రియుడు