Arguments in AP High Court on Inner Ring Road: రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే చంద్రబాబుపై వరుస కేసులు పెడుతున్నారని.. ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. ఒక్క ఎకరా భూమి సేకరించని, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని.. కేవలం కాగితాలకే పరిమితమైన ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో కొందరికి లబ్ధి చేకూరిందన్న మాటే ఉత్పన్నం కాదన్నారు. చంద్రబాబు ఇంటి అద్దెగా లింగమనేనికి 27 లక్షలు చెల్లించారని.. క్విడ్ ప్రోకో జరిగిందనే ఆరోపణల్లో అర్థం లేదని వాదించారు. ఈ కేసులో చంద్రబాబుకు బెయిలు మంజూరు చేయాలని హైకోర్టును కోరారు.
గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను ప్రస్తుత ప్రభుత్వం క్రిమినల్ చర్యలుగా చిత్రీకరిస్తోందని.. చంద్రబాబు నాయుడి తరఫు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. కేసులు పెట్టి వేధించడానికి చట్ట నిబంధనలను ఆయుధంగా వినియోగిస్తోందన్నారు. రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు దురుద్దేశపూరితంగా చంద్రబాబుపై వరుసగా కేసులు నమోదు చేస్తోందన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అమలే కాలేదన్న విషయం ప్రస్తావించారు. దాని కోసం ఒక్క ఎకరా భూమి సేకరించింది లేదని, ఒక్క రూపాయి ఖర్చు చేసిందీ లేదని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్ట్ కేవలం కాగితాలకే పరిమితమైందన్నారు. అలాంటప్పుడు కొందరికి లబ్ధి చేకూరిందనే ప్రస్తావనే ఉత్పన్నం కాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి మాస్టర్ ప్లాన్, రింగ్‌రోడ్డును పట్టించుకోలేదని వివరించారు. అందువల్ల రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ మార్పు ద్వారా కొందరికి లబ్ధి, మరికొందరికి నష్టం జరిగిందనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పిటిషనర్‌కు బెయిలు మంజూరు చేయాలని కోరారు.
వ్యాపార విస్తరణలో భాగంగా హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ 2014లో భూములు కొనుగోలు చేసిందని.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. ఆ సంస్థ లిస్టెడ్ కంపెనీ జాబితాలో ఉందని, లక్షల మంది ప్రజలు షేర్ హోల్డర్స్‌గా ఉన్నారని తెలిపారు. ఆ సంస్థ కొన్న భూమి ప్రతిపాదిత ఇన్నర్ రింగ్ రోడ్డుకు 4 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు.
వ్యాపార విస్తరణలో భాగంగా హెరిటేజ్ సంస్థ పలు ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేసిందన్నారు. క్విడ్ ప్రోకో కింద వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారన్న ఆరోపణల్లో అర్థం లేదన్నారు. 2017 జులై నుంచి చంద్రబాబు ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారని.. అద్దె కింద 2019 జూన్‌లో 27 లక్షలు చెల్లించారని తెలిజయజేశారు.
రాజధాని నిర్మాణం కోసం అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ప్రాసిక్యూషన్ చేయడానికి వీల్లేదని సీఆర్డీఏ చట్టం సెక్షన్ 146 స్పష్టం చేస్తోందన్నారు. రాజధాని బృహత్తర ప్రణాళిక, ఇన్నరింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ తుది నోటిఫికేషన్‌ను.. ఫిర్యాదుదారు, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అప్పట్లో సవాలు చేయలేదన్నారు. అభ్యంతరాలు కూడా లేవనెత్తలేదని న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఆరేళ్ల తర్వాత కేసు నమోదు చేసినట్లు ధర్మాసనం తీర్పులో గుర్తు చేసిందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటిషనర్ కుమారుడ్ని నిందితుడిగా చేర్చారని కోర్టు దృష్టికి తెచ్చారు.
మాజీ మంత్రి నారాయణను ఇంటి వద్దే విచారించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం
ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ రూపకల్పన టెండర్లో అర్హతలేని సంస్థలు బిడ్లు వేయడంతో తిరస్కరించినట్లు న్యాయవాదులు తెలిపారు. రాజధాని ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఎలైన్‌మెంట్ రూపకల్పన ప్రాజెక్టును నామినేషన్ పద్ధతిలో అప్పగించాలని సీఆర్డీఏ అథారిటీ నిర్ణయం తీసుకుందన్నారు. అథార్టీలో ఇతర అధికారులతో పాటు పిటిషనర్ ఓ సభ్యుడు మాత్రమేనన్నారు.
నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలనేది సమష్టి నిర్ణయమని, దాన్ని ఏ ఒక్కరికో ఆపాదించడానికి వీల్లేదన్నారు. దురుద్దేశపూరితంగా పిటిషనర్‌పై కేసు నమోదు చేశారన్నారు. ఇదే కేసులో ఇతర నిందితులకు ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసిన విషయం ప్రస్తావించారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని చంద్రబాబుకు బెయిలు మంజూరు చేయాలని కోరారు.
ప్రభుత్వం, సీఐడీ తరఫున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్.. రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసిందనడం సరికాదన్నారు. స్కిల్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న పిటిషనర్‌ను ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ రిమాండ్‌లో ఉన్నట్లుగా భావించడానికి వీల్లేదన్నారు. ఏసీబీ కోర్టులో పీటీ వారంట్ దాఖలు చేశామన్నారు. పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. పీటీ వారంట్ పెండింగ్‌లో ఉండగా బెయిలు పిటిషన్‌పై విచారణ జరపవచ్చా అనే అంశంపై వాదనలు వినిపించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులకు సూచించారు.