Ajeya Kallam Petition in Telangana High Court: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వారం రోజుల క్రితం వివేకా హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పలు కీలక విషయాలు బయటికి వచ్చాయి. వివేకా కేసులో 259వ సాక్షిగా సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల వాంగ్మూలం, హత్య జరిగిన తర్వాత వివిధ సందర్భాల్లో సునీత నర్రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలు, రహస్య సాక్షి వివరాలను సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అయితే తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన వాంగ్మూలంపై తెలంగాణ హైకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసిందని అందులో వెల్లడించారు. సీఎం జగన్‌ను భారతి పిలిచారనే విషయాన్ని తాను సీబీఐకి చెప్పలేదని చెప్పారు. వివేకా హత్య కేసు ఛార్జిషీట్ నుంచి తన వాంగ్మూలాన్ని తొలగించాలని కోరారు. దీనికి సంబంధించి మళ్లీ విచారణ జరిపేలా సీబీఐని ఆదేశించాలని హైకోర్టుకు వేసిన పిటిషన్‌లో అజేయ కల్లం విజ్ఞప్తి చేశారు. అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Viveka murder case updates: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. కీలక సాక్షుల వాంగ్మూలాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) కీలక సాక్షుల వాంగ్మూలాలను గత నెల 30వ(జూన్) తేదీన కోర్టుకు సమర్పించింది. ఈ క్రమంలో సీబీఐ సమర్పించిన వాంగ్మూలాలను.. ధర్మాసనం విచారణకు స్వీకరించడంతో మరికొంతమంది కీలక సాక్షుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఆ కీలక సాక్షుల్లో.. సీఎం జగన్ ఓఎస్‌డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, విశ్రాంత సీఎస్ అజేయ కల్లం, వైఎస్సార్సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్‌కుమార్‌ల నుంచి సాక్షులుగా సేకరించినట్లు సీబీఐ పేర్కొంది.
విశ్రాంత సీఎస్ అజేయ కల్లం.. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న విశ్రాంత సీఎస్ అజేయ కల్లంను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారించగా..''లోటస్‌పాండ్‌లో ఉండగా ఆరోజు ఉదయం 5.30కు జగన్ అటెండర్ తలుపు కొట్టారు. భారతి మేడం మేడపైకి రమ్మంటున్నారని అటెండర్.. జగన్‌కు చెప్పారు. బయటకు వెళ్లిన 10 నిమిషాల తర్వాత జగన్ మళ్లీ వచ్చారు. బాబాయ్ ఇక లేరని నిలబడే జగన్ మాకు చెప్పారు.'' అని అజేయ కల్లం వెల్లడించినట్టు సీబీఐ వాంగ్మూలంలో వివరించింది.