Growing interest among the youth in 'Karrasamu': ''కర్రసాము' ఆట గురించి పట్టణాల్లో నివసించే నేటి యువతకు పెద్దగా తెలియకపోవచ్చు గానీ, గ్రామాల్లో ఉండే యువతకు మాత్రం బాగా తెలుసు. ఎందుకంటే.. ఊర్లల్లో ఇప్పటికీ ఏదైనా ఉత్సవాలు జరిగినా, పెళ్లిళ్లు జరిగినా కొంతమంది పెద్దవాళ్లు కర్రసాము చేస్తూ.. అందర్నీ ఆకట్టుకుంటుంటారు. అటువంటి ఆటను అంతరించిపోకుండా ఉండేందుకు కొంతమంది నిపుణులు పలుచోట్ల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే, కర్రసాముకు ఉన్న చరిత్ర, ఉపయోగాలు, కర్రసామును ప్రదర్శించే విధానంపై రోజురోజుకు యువతలో ఆసక్తి పెరుగుతుందట. అంతేకాదు, కొంతమంది యువతీ, యువకులు రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ఎన్నో పతకాలు సాధించి.. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారట. మరి ఏంటి ఈ కర్రసాము చరిత్ర..?, ఈ ఆట వల్ల ఉపయోగాలు ఏమిటి..?, యువత కర్రసాము వైపు మొగ్గుచూపడానికి కారణాలెంటి..? తెలుగు రాష్టాల్లో ఏ ప్రాంతంలో ఈ కర్రసాము శిక్షణ ఇస్తున్నారు..? అనే వివరాలు మీకోసం..
కర్రసాము ప్రాచీన కళ.. ప్రాచీన యుద్ధ కళలు అంతరించిపోకుండా నేటి, భవిష్యత్ తరానికి అందించాలన్న లక్ష్యంగా పలు చోట్ల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి కోవలోకి చెందిందే కర్రసాము. ఇప్పుడిది 'సిలంబం' పేరుతో ప్రాచుర్యంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత ప్రాచీన అంశంతో పాటు.. ఆత్మరక్షణకూ.. ఇది అత్యంత అనుకూలమైనది. దీనిని తగిన విధంగా అభ్యసిస్తే మానసిక, శారీరక దృఢత్వంతో పాటు ఆత్మరక్షణకు దోహదపడుతుంది. ఏ సమయంలోనైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా సిలంబం అండగా నిలుస్తుంది. ఇప్పుడీ సాధన వైపు అధికశాతం యువత మొగ్గుచూపుతోంది. ఫలితంగా జాతీయ స్థాయుల్లోనూ పతకాలు సాధించి.. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
యుద్ధ విద్యలు అంటే.. కరాటే, కుంఫూ, తైక్వాండో వంటివే అనుకుంటాం. కానీ, సిలంబం కూడా అలాంటిదే అని చాలామందికి తెలియదు. స్వాతంత్య్ర సమరంలో కీలకంగా ఉన్న కర్రసాము అనంతరం వెనకబాటుకు గురైంది. కానీ, ఆ ఆట ప్రాముఖ్యత గుర్తించిన కొందరు మహోన్నతులు కర్రసాముకు తిరిగి ప్రాణం పోశారు. క్రమంగా దీని ప్రాముఖ్యత తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఇప్పటికే ఎంతోమంది ఈ యుద్ధ క్రీడలో రాణిస్తూ ముందుకు సాగుతున్నారు.
కర్రసాము వస్తే.. ఐదారుగురు తోడున్నట్టే.. కర్రసాము ప్రాముఖ్యత కాలక్రమేణా తగ్గినా.. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో సజీవంగానే ఉంది. ఐతే, నగర యువతకు కర్రసాము క్రీడపై అవగాహన తక్కువే ఉండేది. ఈ నేపథ్యంలో కర్రసాము ఔనత్యాన్ని యువతకు తెలియపర్చేందుకు సంప్రదాయ కర్రసాము పోటీలను నిర్వహిస్తున్నారు. కర్రసాము సాధనతో ఆత్మరక్షణతో పాటు అధిక బరువు తగ్గడానికి, మడమలు, కీళ్లు, ఎముకల పటుత్వానికి, రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు, ఏకాగ్రత పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఆత్మరక్షణకూ సిలంబం ఉపయోపడుతోంది. ఆపద సమయంలో కర్ర చేతిలో ఉంటే.. ఐదారుగురు తోడున్నట్టే అని చెప్పొచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సిలంబానికి మార్షల్ ఆర్ట్‌కు అధికారిక గుర్తింపు ఇవ్వడంతో ఈ ప్రాచీన యుద్ధ విద్య మళ్లీ ప్రాణం పోసుకుంది.
కర్రసాముపై పెరుగుతున్న ఆసక్తి.. సిలంబంలో రాణిస్తున్న కొందరు క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ఎన్నో పతకాలు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది కర్రసాముపై ఆసక్తిని పెంచుకుంటుకుంటున్నారు. కర్రసాములో రాణించాలంటే ఆషామాషీ కాదు. దీనికి ఎంతో నేర్పు, మరెంతో సాధన, సమయస్ఫూర్తి, సాహసాభిరుచి ఆలోచనాశక్తి అవసరం. చకచకా కర్ర తిప్పుతూ.. ప్రత్యర్థికి కర్రతో ధీటుగా సమాధానం చెబితేనే ఇందులో రాణించగలరు. సిలంబం సాధనలో చకచకా కర్ర తిప్పుతూ.. చూపరుల దృష్టిని ఆకర్షిస్తూ.. కఠోరమైన సాధన చేస్తున్నారు యువతీ, యువకులు. ఫలితంగా రాష్ట్ర, జాతీయ స్థాయి కర్రసాము పోటీల్లో తమదైన ప్రతిభ కనబరుస్తూ.. పతకాలను సొంతం చేసుకుంటున్నారు.
ప్రతి ఒక్కరికి ఈ మార్షల్ ఆర్ట్స్ అవసరం ఎంతో ఉంటుందన్నది దీనిని అభ్యసిస్తున్న వారి విశ్వాసం. అందుకు చిన్న, పెద్ద.. స్త్రీ, పురుష తారతమ్యాలు లేకుండా అందరూ కర్రసాము సాధన చేస్తున్నారు. మిగతా క్రీడలతో పోల్చితే.. సిలంబం పతకాలు తెచ్చిపెట్టడంతో పాటు ఆపదలో తమను తాను కాపాడుకునేందుకూ దోహదపడుతుందని సాధన చేస్తున్న యువతులు చెబుతున్నారు.
రోజుకు 2 గంటలపాటు సాధన.. నిత్యం ఉషోదయానికి ముందే కర్రసాము సాధన ప్రారంభమవుతోంది. రోజుకు గంట లేదా 2 గంటల పాటు చేసే సాధన శిక్షకుల్లో మానసిన ఉల్లాసాన్ని కల్గిస్తోంది. దీంతో విద్యార్థులు చురుగ్గా ఉంటూ.. చదువుల్లోనూ మెరుగైన ప్రతిభ కనబరచడానికి దోహదపడుతోంది. కర్రసాము ఓ వైపు పతకాలు తెచ్చిపెడుతుండగా.. మరోవైపు విద్యార్థుల మానసిక ఉల్లాసం కలగడం, ఆత్మ రక్షణకు దోహదపడడం, చదువుల్లో ముందుండటానికి సైతం ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.
స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్లు అందించాలి.. సిలంబం క్రీడా శిక్షణను.. తెలుగు రాష్టాల్లోని ఆయా ప్రాంతాల్లో శిక్షణను ఇస్తుండగా.. విశాఖలో కర్రసాము శిక్షణను కోచ్ లక్ష్మణ్ దేవ్ అందిస్తున్నారు. కొన్నేళ్లుగా కర్రసాములో నిష్ణాతులను తీర్చిదిద్దిన కోచ్.. పతకాలు సాధిస్తున్న వారికి విద్య, ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్లు అందించాలని కొరుతున్నారు. ఈ విధానాన్ని ఇప్పటికే పక్క రాష్ట్రాలు అమలుపరుస్తుండగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ విధంగా చర్యలు తీసుకుంటే ఇంకా అనేక మంది యువతీ, యువకులు కర్రసాములో రాణించగలరని ఆయన అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే కర్రసాము క్రీడకు తమిళనాడు, కేరళ, దిల్లీ ప్రభుత్వాలు స్పోర్ట్స్ కోటా కింద ప్రత్యేక రిజర్వేషన్లు అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అలాంటి చర్యలు తీసుకుంటే.. కర్ర సాములో రాణించడానికి ఇంకా ఎక్కువ మంది విద్యార్థులు ముందుకు రావడంతో పాటు ఈ తరహా ప్రాచీన కళలు అంతరించకుండా ముందు తరాలకు అందించవచ్చని క్రీడా నిపుణులు చెబుతున్నారు.