Amicus Curiae On Convicted Representatives : నైతికపరమైన అంశాలు ఇమిడి ఉన్న కేసుల్లో శిక్షపడిన చట్టసభ సభ్యులను జీవితాంతం ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టుకు సీనియర్ న్యాయవాది, అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తన నివేదికలో సూచించారు. వారిని తిరిగి చట్టసభలో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులుపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను త్వరితగతిన నిర్వహించాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హన్సారియా అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్నారు. ఈ అంశంలో ఎప్పటికప్పుడు సర్వోన్నత న్యాయస్థానానికి నివేదికలు సమర్పిస్తున్నారు.
శుక్రవారం ఈ పిటిషన్ సుప్రీకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన తన 19వ నివేదికను సమర్పించారు. ఆత్యాచారం,ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నేతల విషయంలో కఠినంగా వ్యహరించాలని అందులో పేర్కొన్నారు. వారిని జీవితాంతం ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలని సూచించారు. నైతిక అంశాలు ఇమిడి ఉన్న కేసుల్లో శిక్ష పడితే నాలుగో తరగతి ఉద్యోగిని కూడా విధుల నుంచి తొలగిస్తున్నారని ఆయన తెలిపారు.
విజయ్ హన్సారియా నివేదిక ప్రకారం..
Vijay Hansaria Report on Convicted Representatives : 2022 నవంబరు నాటికి దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 5,175 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,116 కేసులు అయిదేళ్లకుపైబడి విచారణలో ఉన్నాయి. ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 1,377 ఉండగా.. 719 కేసులతో రెండో స్థానంలో బిహార్ ఉంది. 92 కేసులు ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా.. అందులో 50 కేసులో అయిదేళ్లపైబడి పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 17 కేసులుండగా.. అందులో అయిదేళ్లపైబడి పెండింగ్‌లో ఉన్నవి 4 కేసులు. ఈ కేసుల విచారణకు సంబంధించి దేశవ్యాప్తంగా జడ్జీలపై పని భారం తీవ్రంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా ఒక్కో జడ్జిపై సగటున 25 నుంచి 210 కేసుల భారం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 92, తెలంగాణలో 1 నుంచి 16 కేసుల భారం ఉంది.
నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే..
- ఎంపీలు, ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు.. ఎన్ని కేసులు విచారణ ముగించాయనే దానిపై నెలవారీ నివేదికలు సమర్పించేలా హైకోర్టులు చూడాలి. అయిదేళ్లకు పైబడిన కేసులు విచారణ ఆలస్యమైతే అందుకు గల కారణాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియపరచాలి.
- ప్రతి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి... ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను కేటాయించేటప్పుడు ఇప్పటికే ప్రత్యేక కోర్టు ఎదుట ఉన్న కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలి.
- సుమోటోగా హైకోర్టు స్వీకరించే కేసులకు ముందు ఎంపీ/ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక కోర్టు నెలవారీ ఇచ్చే నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆయా కేసుల్లో త్వరగా విచారణ ముగించేందుకు తగిన మార్గదర్శకాలను హైకోర్టులు ఇవ్వాలి. విచారణకు నిందితులు సహకరించకున్నా, జాప్యం చేసినా లేదంటే ఈ విషయంలో ప్రత్యేక కోర్టులు లేవనెత్తిన ఇతర అంశాలపై హైకోర్టులు నిర్దిష్టమైన మార్గదర్శకాలనివ్వాలి.
- ఎంపీలు/ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలపై.. ప్రత్యేకంగా తమ వెబ్‌సైట్‌లో హైకోర్టులు ప్రస్తావించాలి.
- సుమోటోగా హైకోర్టు విచారించిన రిట్ పిటిషన్లలో జారీ చేసిన ఉత్తర్వులను అప్‌లోడ్ చేయాలి.
- జిల్లాల వారీగా ఎంపీ/ఎమ్మెల్యేల స్పెషల్ కోర్టులు సెషన్స్, మెజిస్ట్రేట్ స్థాయిలో జారీ చేసిన ఉత్తర్వులు అప్‌లోడ్ చేయాలి.
ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసుల విచారణ.. అమికస్క్యూరీ సూచనలు