మొదటి భార్య, ఆమెకు పుట్టిన సంతానాన్ని చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో వివాహం చేసుకునే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇస్లామిక్ చట్టం ప్రకారం ముస్లింలకు మొదటి భార్య ఉండగానే.. రెండో పెళ్లి చేసుకునే హక్కు ఉందని హైకోర్టు తెలిపింది. అయితే మొదటి భార్య అనుమతి లేకుండా భర్త.. రెండో పెళ్లి చేసుకోవడం.. మొదటి భార్యపై కక్ష తీర్చుకోవడమే అవుతుందని స్పష్టం చేసింది. భార్యకు ఇష్టం లేకుండా తనతో కలిసి ఉండమని కోర్టు ద్వారా కోరే హక్కు వారికి లేదని పేర్కొంది. అలాచేస్తే అది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందని హైకోర్టు బెంచ్ తెలిపింది. ఈ మేరకు అజీజుర్ రెహమాన్ అనే వ్యక్తి అప్పీలును తోసిపుచ్చుతూ జస్టిస్ ఎస్పీ కేశర్వణి, జస్టిస్ రాజేంద్రకుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పు వెలువరించింది.
అసలు కేసు ఏంటంటే..
అజీజుర్ రెహమాన్, హమీదున్నిషా 12 మే 1999న వివాహం చేసుకున్నారు. హమీదున్నిషా తన 93 ఏళ్ల తండ్రిని, ముగ్గురు పిల్లలనూ చూసుకుంటూ ఇంట్లో ఉంటుంది. ఆమెకు తెలియకుండా రెహమాన్.. రెండో పెళ్లి చేసుకున్నాడు. తనతో కలిసి ఉండాలని మొదటి భార్యను కోరుతూ ఫ్యామిలో కోర్టులో పిటిషన్ వేశాడు. దాన్ని కోర్టు నిరాకరించింది. ఖురాన్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఒక ముస్లిం తన భార్య, పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోతే.. అతను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అనుమతించబోమని సంత్ కబీర్‌నగర్ ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. భార్యను తనతో ఉండమనే హక్కు రెహమాన్‌కు లేదని తేల్చి చెప్పింది. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు రెహమాన్. మొదటి భార్య హమీదున్నీషా అలియాస్ షఫీకున్నీషాకు ఇష్టం లేకుండా.. తన భర్తతో కలిసి ఉండాలని కోరేందుకు ఫ్యామిలీ కోర్టు నిరాకరించడాన్ని హైకోర్టు సమర్థించింది. ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఫిటిషన్ను కొట్టివేసింది.
"ఆర్టికల్ 21 ద్వారా ప్రతీ భారతీయుడికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఆర్టికల్ 14 కూడాఅందరికీ సమానత్వపు హక్కును కల్పిస్తుంది. ఆర్టికల్ 15(2) ప్రకారం వ్యక్తిగత చట్టాల పేరుతో పౌరులకు రాజ్యాంగ పరమైన హక్కులను దూరం చేయడం కుదరదు. జీవించే హక్కుల్లో గౌరవప్రదంగా జీవించే హక్కు ఒకటి. మహిళలను గౌరవించని సమాజాన్ని నాగరికత అనలేము. స్త్రీలను గౌరవించే దేశాన్ని మాత్రమే నాగరిక దేశం అంటాం. ముస్లింలు ఒక భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోకుండా ఉండాలి. ఒక భార్యకు న్యాయం చేయలేని ముస్లిం వ్యక్తి మరొకరిని వివాహం చేసుకోవడానికి ఖురాన్ అనుమతించదు" అని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: అశ్రునయనాల మధ్య ములాయం అంత్యక్రియలు.. కడసారి చూసేందుకు పోటెత్తిన ప్రజలు
తదుపరి సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్.. ప్రతిపాదించిన ప్రధాన న్యాయమూర్తి