'ఛలో దిల్లీ' కార్యక్రమాన్ని కొనసాగించాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి నిర్ణయించింది. డిసెంబర్ మూడో తేదీన రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతామని కేంద్రం ఇటీవల ప్రకటించగా... దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులంతా నిరంకారి సంఘ్ మైదానానికి వెళితే మరింత తొందరగా చర్చలు జరుపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ప్రతిపాదన చేశారు. అయితే రైతు సంఘాల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చేంత వరకు ఎక్కడికీ వెళ్లేది లేదని స్పష్టం చేశారు రైతులు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించిన రైతు సంఘాలు... చర్చలకు సిద్ధమంటూనే రైతులకు షరతులు విధించడం సరికాదని పేర్కొన్నారు.
హోంశాఖ, నిఘా వర్గాల ద్వారా కాకుండా అత్యున్నత రాజకీయ నేతల స్థాయిలో చర్చలు జరగాలని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి డిమాండ్ చేసింది. దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతుల పోరాట స్ఫూర్తిని అభినందిస్తూ.. రైతులంతా పెద్ద సంఖ్యలో దిల్లీ చేరుకోవాలని పిలుపునిచ్చింది. డిసెంబర్ 1 నుంచి అన్ని రాష్ట్రాల్లో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.
వ్యవసాయ చట్టాలను వ్యతిరేస్తూ దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు నాలుగోరోజూ కొనసాగాయి. పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల రైతులు పెద్ద సంఖ్యలో ఆందోళనల్లో పాల్గొంటున్నారు. సింఘు, టిక్రీ, గాజీపూర్ సరిహద్దుల్లో రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనకారులకు దిల్లీ సిక్కు గురుద్వారా మేనెజ్మెంట్ కమిటీ భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. రోడ్డుపైనే భోజనం చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు అన్నదాతలు. పోలీసులు అనుమతించిన నిరంకారీ మైదానంలో నిరసన తెలిపేందుకు నిరాకరిస్తున్న రైతులు... దేశ రాజధాని నడిబొడ్డున తమ గళాన్ని వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రామ్‌లీలా మైదానం లేదా జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: 'ఛలో దిల్లీ' కొనసాగించాలని రైతు సంఘాలు నిర్ణయం