కర్ణాటక.. బెంగళూరులో విషాద ఘటన వెలుగు చూసింది. ఐదేళ్ల కుమార్తెను అపార్టుమెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేసింది ఓ కన్నతల్లి. దీంతో అక్కడిక్కడే ఆ చిన్నారి మృతి చెందింది. ఆపై ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడడానికి ప్రయత్నించింది. వెంటనే గుర్తించిన స్థానికులు ఆమెను కాపాడారు.
ఇదీ జరిగింది.. బెంగళూరులోని సంపంగిరామనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్య అపార్ట్మెంట్లో కిరణ్ అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ నివాసం ఉంటున్నాడు. ఐదేళ్ల క్రితం అతడి భార్య సుష్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కిరణ్ కుమార్తె ద్వితి.. పుట్టుకతోనే దివ్యాంగురాలు. మూడు నెలల క్రితం.. సుష్మ తన కుమార్తెను రైల్వే స్టేషన్లో విడిచిపెట్టి వచ్చింది. వెంటనే తెలుసుకున్న భర్త కిరణ్.. వెతికి తీసుకొచ్చాడు. అయితే గురువారం కిరణ్ ఆఫీస్కు వెళ్లాక.. ఈ దారుణానికి ఒడిగట్టింది సుష్మ.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. భర్త కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపడుతున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డు అయిన ఘటనా దృశ్యాలు ఆధారంగా పోలీసులు.. చిన్నారి తల్లిని విచారిస్తున్నారు.
40 అడుగుల బావిలో నవజాత శిశువు..
గుజరాత్లోని దాహోద్ జిల్లాలో హృదాయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. భౌ గ్రామంలో ఓ నవజాతి శిశువును తాడుతో కట్టి 40 అడుగుల లోతైన బావిలో గుర్తుతెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు. గమనించిన గ్రామస్థులు.. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని వెదురు బుట్ట సహాయంతో చిన్నారిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం జైడస్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి పాదాలకు చీమలు దారుణంగా కుట్టాయని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: ఆడపిల్ల పుట్టిందని అమానుషం.. సజీవంగా పొలంలో ఖననం.. రక్షించిన రైతు
కాంగ్రెస్ నిరసనల్లో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక