మన్మథుడు సైతం చిన్నబోయేలా ఫేస్‌బుక్ ద్వారా చిలిపి సందేశాల్ని పంపుకొన్నారు. ఆమెను తలచుకోనిదే ఒక్క క్షణమైనా గడవని పరిస్థితులకు ఆ యువకుడు చేరుకున్నాడు. ఈ జీవితానికి తన అర్ధాంగి ఆమేనని అందరికీ తేల్చిచెప్పేశాడు. అందుకు ఆమె కూడా అంగీకరించింది. పెళ్లి ఖర్చులకంటూ ఆమె పినతల్లి ద్వారా రూ.3.50 లక్షలను సర్దుబాటు చేశాడు. ఇంతకూ పెళ్లి పీటల మీదకు వచ్చే సరికి కంగుతినడం ఆ యువకుడి వంతైంది. తను ప్రేమించిన అసలైన ఆ కలల రాణికి అక్షరాలా 50 సంవత్సరాలని తెలిసి గుడ్లు తేలేశాడు. పినతల్లిగా నాటకమాడిన మహిళే ఫేస్‌బుక్‌లో పరిచయమైన తన కలలరాణి అని తెలుసుకుని కన్నీరు మున్నీరయ్యాడు. కర్ణాటకలోని మండ్య జిల్లాలోని నాగమంగల తాలూకాలో జరిగిన యథార్థ సంఘటన ఇదీ.
ఆలస్యంగా వెలుగుచూసిన ఆ సంఘటన వివరాల్లోకెళ్తే.. నాగమంగళ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమె తన ఫొటోను కూడా పంపింది. ఇద్దరి నడుమ కొనసాగిన చిరు సందేశాలు చివరకు ప్రేమగా మారాయి. తనను చూసేందుకు ఎప్పుడూ రావద్దని ఆమె చెప్పేది. తన తల్లిదండ్రులకు ఇష్టంలేదని వివరణ ఇచ్చేది. పెళ్లికి ఆ యువకుడు ఒత్తిడి చేయడంతో మాట్లాడేందుకు పినతల్లిని పంపుతున్నట్లు చెప్పింది. అనుకున్నట్లుగానే యువకుడి ఇంటికి పినతల్లి వచ్చింది. అందరితో కలుపుగోలుగా మాట్లాడింది. ఇంట్లోవారికి తెలియకుండా ఆ యువకుడు రూ.3.50 లక్షలను ఆమెకు అందించాడు. అనుకున్నట్లుగానే పెళ్లి ఖరారైంది.
ఆదిచుంచనగిరి మఠంలో వివాహాన్ని నిర్ణయించారు. పెళ్లికి వచ్చిన ఆ వయస్సు మళ్లిన మహిళ గత రాత్రే ఆ యువతిని కొందరు అపహరించారని ఓ కథను వినిపించింది. దీన్ని విన్న తరువాత ఆ యువకుడు, అతని తల్లిదండ్రులకు అనుమానమొచ్చింది. వెంటనే ఆమెను పోలీసులకు అప్పగించారు. తమదైన శైలిలో దర్యాప్తును చేపట్టిన పోలీసులకు అసలు యువతి అనేదే ఈ ఘట్టంలో లేదని, ఆమే యువతిగా మరొకరి ఫొటో పంపినట్లు అంగీకరించింది. అంతేకాకుండా.. యువకుడి నుంచి తీసుకున్న రూ.3.50 లక్షలను వెనక్కు ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది.
ఇదీ చూడండి : దళితుడి నోట్లోని ఆహారాన్ని తీయించుకొని తిన్న ఎమ్మెల్యే!