Indian Army soldiers: లద్దాఖ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. 26 మంది సైనికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి శ్యోక్ నది సమీపంలో లోయలో పడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పర్తాపుర్ ట్రాన్సిట్ క్యాంప్ నుంచి లేహ్ జిల్లా తుర్తుక్ ఫార్వర్డ్ లొకేషన్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన పర్తాపుర్లోని ఫీల్డ్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సైనికులకు మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్‌లో తరలింపునకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
మోదీ, రాజ్‌నాథ్ విచారం: లద్దాఖ్ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. బాధిత కుటుంబాలకు మోదీ.. ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జవాన్ల త్యాగాలను దేశం గుర్తుంచుకుంటుందని అన్నారు రాజ్‌నాథ్. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు.