బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగా నదిలో పుణ్య స్నానం ఆచరించేందుకు వెళ్తున్న యాత్రికుల ఆటోను ఓ గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల వివరాలు..
సహర్సా జిల్లాకు చెందిన యాత్రికులు మహాదేవ్పుర్ ఘాట్‌లోని గంగా నదిలో పుణ్యస్నానం చేసేందుకు ఆటోలో సోమవారం ఉదయం బయలుదేరారు. ఈ క్రమంలో మాధేపురా వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటోను ఓ గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదం చౌసా పోలీస్ స్టేషన్ పరిధిలోని కలాసన్-చౌసా రాష్ట్ర జాతీయ రహదారిపై జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లోని చౌసా కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)కి తరలించారు.
యాత్రికుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇంకొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో నలుగురు క్షతగాత్రులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. మృతులు.. సహర్సా జిల్లాలోని దుర్గాపుర్ బద్ది గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మాధేపురాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఒకరికి 7 ఏళ్లు.. మరొకరికి 4 నెలలు..
గుజరాత్‌లోని నవ్సారి జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు కుమార్తెలను హతమార్చారు తల్లిదండ్రులు. అనంతరం వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. నవసారి జిల్లాలోని రావనియా గ్రామంలో చునీలాల్ గావిత్, తనూజ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు బాలికలు. కాగా, చునీలాల్ డామన్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడి భార్య గృహిణీ. చునీలాల్కు ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ భార్య తనూజ అతడితో తరచూ గొడవ పడేది. భార్య తనూజ, ఇద్దరు పిల్లలను విహార యాత్రకు తీసుకెళ్లి ఆనందంగా గడిపాడు చునీలాల్. అనంతరం ఇంటికి తిరిగి వచ్చారు.
గొడవలతో మనస్తాపం చేందిన దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రి పిల్లలు నిద్రిస్తున్న సమయంలో వారిని చంపి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఉదయం చునీలాల్ తండ్రి గదిలోకి వెళ్లి చూడగా ఒక్కసారి షాక్‌కు గురయ్యాడు. నలుగురి మృతదేహాలను చూసి బోరును విలపించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలికి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చిన్నారులను కాశీశ్(7 సంవత్సరాలు), దిత్య(4 నెలలు)గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.