తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలో జరిగిన ఓ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఉర్పక్కం ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లోని మొదటి అంతస్తులో రిఫ్రిజిరేటర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అపార్ట్మెంట్లో గిరిజ అనే మహిళ, ఆమె బంధువులు రాధ, రాజ్‌కుమార్, రాజ్‌కుమార్ భార్య భార్గవి, వారి కుమార్తె ఆరాధన నిద్రిస్తుండగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల రిఫ్రిజిరేటర్ పేలిపోయింది. దీంతో విపరీతమైన పొగ వచ్చింది. నిద్రిస్తున్న వారంతా పొగలో చిక్కుకున్నారు. వారి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు వారు లోపల చూడటానికి తలుపు బద్దలు గొట్టారు. ఆ తర్వాత లోపల చూసేసరికి రాజ్‌కుమార్, రాధ, గిరిజ ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం తరలించారు. భార్గవి, ఆరాధనలను క్రోంపేట ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. కాగా, చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ రాహుల్‌నాథ్ ఈ ఉదయం ఆ ఇంటిని సందర్శించి పరిశీలించారు.
ఇవీ చదవండి: గొంతులో ఆమ్లెట్ ఇరుక్కుని వ్యక్తి మృతి..